చెట్టుకు ఉరివేసుకుని యువతి ఆత్మహత్య: పెళ్లింట్లో భారీ చోరీ
ఖమ్మం: జిల్లాలోని కూనవరం మండలం శబరికొత్తగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కూతురు మృతి విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వృద్ధురాలిపై దాడి: 3.5 లక్షల బంగారం దోపిడీ
ఖమ్మంలోని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వృద్ధురాలిపై దాడి చేశారు. వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచిన దొంగలు ఇంటి నుంచి మూడున్నర లక్షల విలువైన బంగారు నగలను దోచుకెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పెళ్లింట్లో చోరీ: భారీ నగదు, నగలు అపహరణ
సికింద్రాబాద్ రెయిన్‌బజార్‌లోని ఓ పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పెళ్లికి సంబంధించిన రూ. 10 లక్షలు, 20 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో పెళ్లి వారు లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి కోసం తెచ్చిన నగదు, నగలు ఎత్తుకెళ్లడంతో పెళ్లి ఎలా చేయాలో అర్థంకాక బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం జీడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లోడుతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications