అనురాధ రాసిన క్రైమ్ కథ: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది, స్కెచ్ మామూలుగా లేదు
చిత్తూరు: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భాగస్వాముల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఓ వివాహిత.. ఏకంగా ఓ కొత్త కట్టుకథను అల్లి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూడటంతో కటకటాలు లెక్కిస్తున్నారు.

పెళ్లికి ముందు నుంచే ప్రియుడితో అనురాధ
వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలం బత్తలాపురానికి చెందిన దామోదరం(25)కు.. పెద్దపంజాణి మండలం పెనుగొలకల గ్రామానికి అనురాధకు 2021లో వివాహం జరిగింది. ఆ సమయంలో దామోదరం తల్లిదండ్రులు అనురాధకు బంగారు నగలు పెట్టి పెళ్లి జరిపించారు. కొంతకాలం వీరికాపురం సజావుగానే సాగింది. అయితే, పెద్దపంజాణి మండలం టీకేపల్లెకు చెందిన గంగరాజు.. అనురాధ తండ్రి చంద్రమోహన్ వద్ద పాల క్యాన్లు వేస్తూ అతని కుమార్తె అనురాధతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు.

పెళ్లైనా ప్రియుడితో కొనసాగిన అక్రమ సంబంధం
మరోవైపు, గంగరాజు గంగవరం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన పద్మావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరు గంగవరంలోని ప్రశాంత్ నగర్‌లో కాపురం ఉంటున్నారు. అయితే, పెళ్లి అనంతరం కూడా అనురాధతో వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడు గంగరాజు. ఇటీవల గంగరాజు అతని అవసరాల కోసం అనురాధ వద్ద ఉన్న బంగారం నగలు తీసుకుని తాకట్టు పెట్టాడు. అయితే, పుంగనూరులో స్థలం కొనాలని, అందుకు డబ్బులు తక్కువగా ఉండటంతో ఇచ్చిన నగలు ఇవ్వమని అనురాధను అడిగారు భర్త, అత్తామామలు.

పెళ్లి నగలు ప్రియుడికి.. అడిగిన భర్త హత్య
పుట్టింటిలో నగలు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకునేది. ఇక తప్పనిసరిగా నగలు ఇవ్వాల్సి వస్తుందని ప్రియుడు గంగరాజుతో భర్తను చంపేందుకు కుట్ర పన్నారు. దీపావళికి భర్త దామోదరంతో కలిసి ద్విచక్రవాహనంపై పెనుగొలకలకు వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తూ సెల్‌ఫోన్ ద్వారా తాము ఎక్కడ ఉన్నదీ గంగరాజుకు ఎప్పుటికప్పుడు అనురాధ తెలియజేసింది. నాగలకుంట చెరువు కట్ట వద్దకు రాగానే గంగరాజు, అనురాధ కలిసి దామోదరం కళ్లల్లో కారం కొట్టారు. ఆ తర్వాత దామోదరంను గంగరాజు కత్తితో పొడిచి చంపాడు.

దోపిడీ దొంగల పనేనంటూ అనురాధ కొత్త కథ
ఇక అనురాధ తన వద్ద ఉన్న కత్తితో చేయి, భుజంపై చిన్న గాయాలు చేసుకుంది. గంగరాజు అనురాధ వద్ద ఉన్న నగలు తీసుకుని పారిపోయాడు. దుండగులు భర్తను భర్తను కత్తితో పొడిచి చంపారని, తన వద్ద ఉన్న నగలను ఎత్తుకెళ్లారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.

ఆ ఒక్క పాయింట్‌తో అనురాధ నాటకానికి చెక్ పెట్టిన పోలీసులు
అన్ని నగలు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఆమె తాళిని మాత్రం ఎందుకు వదిలేశారనేదానిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. అసలు నిందితులు అనురాధ, గంగరాజు అని తేల్చారు. వీరిద్దరిని పద్దపంజాణి మండలం కోగిలేరు చెక్ పోస్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నగలు, మూడు సెల్‌ఫోన్లు, బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ గంగయ్య, పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications