మిస్టరీగానే శ్రీదేవి హత్య: సహజీవనం కోసం వచ్చి హత్యకు గురైంది
నెల్లూరు: జిల్లాలోని తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెంలో ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురైన మహిళ కేసు మిస్టరీ మూడు రోజులైనా వీడలేదు. మృతురాలిని బల్లికురవ మండలం వెంగాయపాలేనికి చెందిన సుశీలమ్మ దంపతుల కుమార్తె మునగచర్ల శ్రీదేవి(36)గా పోలీసులు గుర్తించారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన వికలాంగుడైన వెంకటేశ్వర్లతో మృతురాలు శ్రీదేవికి వివాహమైంది. కాగా, ఐదేళ్ల క్రితం కేవీ పాలేనికి చెందిన పులిపాటి రామాంజనేయులు పొగాకు కొట్టుడు, బ్యారన్ పను కోసం డీసీపల్లికి వెళ్లాడు.
ఆ సమయంలో శ్రీదేవితో అతడికి పరిచయమై వారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వికలాంగుడైన భర్త వెంకటేశ్వర్లును వదిలేసి రామాంజనేయులు ఉంటున్న కొర్రపాటివారిపాలెం వచ్చి అతడితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ గ్రామంలోని ఎస్సీ కాలనీ చివరి వీధిలో ఉంటున్నారు.

మద్యం అలవాటున్న వెంకటేశ్వర్లుకు శ్రీదేవి తరచూ డబ్బులు ఇస్తుండేది. అయితే, ఇటీవల మొదటి భర్త వెంకటేశ్వర్లుకు అనారోగ్యంగా ఉండటంతో అతని వద్దకు వెళ్లి 15రోజులు ఉండివచ్చింది. కాగా, ఆమెకు తరచూ ఇతరుల నుంచి ఫోన్లు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె హత్యకు గురైంది.
కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఆమె భర్తను ప్రశ్నించగా.. తనకు ఆమె హత్యతో ఎలాంటి సంబంధం లేదని వెంకటేశ్వర్లు పోలీసులకు తెలిపాడు. కాగా, ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో భోజనం చేసేందుకు ఇంటికి వచ్చానని, అప్పటికే శ్రీదేవి మృతి చెందివుందని రామాంజనేయులు తెలిపాడు.
శ్రీదేవి హత్య కేసు మిస్టరీగా మారడంతో పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించారు. మృతురాలు శ్రీదేవి ఉంటున్న నివాసం, ఇతర ప్రాంతాల్లో వివరాలు సేకరించారు. కాగా, శ్రీదేవి వాసన చూసిన పోలీస్ డాగ్.. అక్కడి నుంచి వరిగడ్డి వామి, దిబ్బల ద్వారా ప్రధాన వీధికి వచ్చి మళ్లీ రామాంజనేయులు పని చేస్తున్న బ్యారన్ పరిసరాల్లో కలియదిరిగింది.
దీంతో రామాంజనేయులే హత్య చేశాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రామాంజనేయులుకు ఇప్పటికే రెండు వివాహాలు అయినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications