భార్యకు గృహ నిర్బంధం: విడాకులివ్వాలంటూ లండన్ చెక్కేసిన భర్త
శ్రీకాకుళం: ఎంబిఏ పూర్తి చేసి లండన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తే తమ కూతురు సుఖంగా ఉంటుందని తలచారు ఆ తల్లిదండ్రులు. అలాగే చేశారు. అయితే అల్లుడు మాత్రం ఆమెను ఇక్కడే వదిలేసి లండన్ వెళ్లాడు. కాగా, అత్తింటివారు ఆమెను గదిలో బంధించి వేధింపులకు దిగారు. దీంతో కూతురు బాధలు చూడలేని ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి తమ కూతురుకు విముక్తి కల్పించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం కాశీబుగ్గ ప్రధాన రహదారిలో నివాసముంటున్న శాసనపురి విశ్వేశ్వరరావు, జ్యోతిల పెద్దకుమార్తె కుసుమ. ఆమెకు అదే పట్టణంలోని నారాయణదొర కళాశాల వెనుక వీధిలో ఉంటున్న తంగుడు భాస్కరరావు, శాంతిమణి పెద్ద కుమారుడు కృష్ణచైతన్యతో 2012 ఫిబ్రవరి 12 న వివాహం జరిగింది.
కృష్ణ చైతన్య ఎంబీఏ చదువుకుని లండన్‌లో ఉద్యోగం చేస్తుండటంతో 350గ్రాముల బంగారం, రూ.6లక్షల నగదు, కట్న కానుకలుగా ఇచ్చారు. వివాహమైన ఐదురోజులకే కృష్ణచైతన్య లండన్‌కు వెళ్లిపోయి, వీసా దొరకలేదంటూ కుసుమను స్థానికంగానే వదిలేశాడు. కొన్నాళ్ల తర్వాత వీసా కోసం నగదు కావాలని కుసుమ తల్లిదండ్రులను కృష్ణచైతన్య డిమాండ్ చేయగా అప్పుచేసి ఇచ్చారు.

అయినప్పటికీ తీసుకెళ్తానంటూనే రెండున్నరేళ్లు కాలయాపన చేశాడు. కుసుమ.. అత్తారింటికి వెళితే వారు బయటకు పొమ్మని కసురుకోవడంతో తల్లిదండ్రులు కులపెద్దలను ఆశ్రయించారు. కులపెద్దలు ఇరు కుటుంబాలనూ మందలించారు. ఇది పద్ధతి కాదని, కుసుమను కాపురానికి తీసుకెళ్లాల్సిందేనని సూచించారు. దీంతో ఏడు నెలల కిందట కృష్ణచైతన్య లండన్ నుంచి వచ్చి టెక్కలికి మకాం మార్చి రైస్‌మిల్లు ఏర్పాటు చేశాడు.
భార్య కుసుమను తనతోపాటు తీసుకెళ్లాడు. అంతా సక్రమంగా జరిగిందని భావిస్తున్న సమయంలోనే కుసుమకు భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. నిత్యం సూటిపోటి మాటలతో నరకాన్ని చూపించాడు. ఇదేమని ప్రశ్నించిన ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆమె మళ్లీ కుటుంబీకుల ద్వారా పెద్ద మనుషులు, పోలీసులను ఆశ్రయించింది.
భర్త కృష్ణచైతన్య, ఆయన కుటుంబీకులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తనతో కాపురానికి రావడం లేదని, విడాకులు కావాలని కృష్ణచైతన్య కుసుమకు లీగల్ నోటీసులు పంపించాడు. దీంతో ఆమె సోమవారం అత్తారింటికి వెళ్లి నిలదీయడంతో ఆమెను ఇంట్లో బంధించి, మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు.
అత్తవారింటికి వెళ్లిన తమ కుమార్తె నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో విశ్వేశ్వరరావు, జ్యోతి దంపతులు అక్కడకు చేరుకొని బందీగా ఉన్న కుసుమ వైనాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్‌ఐ వేణుగోపాలరావు అక్కడకు చేరుకొని తలుపులు తీయించి ఆమెకు విముక్తి కల్పించారు. ఇలాంటి చర్యకు మరోసారి దిగితే చర్యలు తీసుకుంటామని కుసుమ అత్తింటివారిని ఎస్ఐ హెచ్చరించారు.
ఇది ఇలా ఉండగా, తనకు భర్తే కావాలని, కనీసం ఆయన్ను చూపించాలని ఎస్‌ఐ వేణుగోపాలరావు వద్ద కుసుమ కన్నీటిపర్యంతమైంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
కుసుమ మాట్లాడుతూ.. లండన్ తీసుకువెళ్తారని తన తల్లిదండ్రులు వివాహం చేస్తే తనను అన్యాయంగా బయటకు పంపించే చర్యలకు పాల్పడ్డారని విలపించారు. కాగా, లండన్‌లో కృష్ణచైతన్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ కారణంగానే కుసుమను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. కుసుమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications