రూ. 46లక్షల అపహరణ: చెట్టుకు విగత జీవిగా వేలాడిన యువకుడు
ఓ యువకుడు విజయనగరం సమీపంలోని గంట్యాడ రోడ్‌లో ఉన్న లేఅవుట్‌లోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విజయనగరం: ఓ యువకుడు విజయనగరం సమీపంలోని గంట్యాడ రోడ్‌లో ఉన్న లేఅవుట్‌లోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడిని స్థానిక అయ్యన్నపేటలో నివసించే సంతోష్‌గా గుర్తించారు. అతడు యాక్సిస్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 13న ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీకి చెందిన నగదు తీసుకొచ్చేందుకు బ్యాంకు మేనేజర్ వెంట సంతోష్ ఎస్కార్ట్‌గా వెళ్లాడు.

అయితే మార్గమధ్యలో ఆ సొమ్ము(రూ.46లక్షలు)తో సంతోష్ పరారయ్యాడు. అప్పటి నుంచి అతడు ఇంటికి కూడా రాలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున సంతోష్ విగతజీవిగా కనపడటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆ సొత్తు దోచుకెళ్లిన దుండగులు.. సంతోష్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, సంతోష్ మరణంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications