కోర్టు ముందుకు చంద్రబాబు - రిమాండ్, బెయిల్ పై ఉత్కంఠ..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu) బయటకు వచ్చేదెప్పుడు. ఇదే ఇప్పుడు రాజకీయ చర్చనీయాంశంగా మారుతోంది. సుప్రీంకోర్టు(Supreme Court)లో క్వాష్ పిటీషన్ విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. ఇటు ఏసీబీ కోర్టు(ACB Court)లో కస్టడీ..బెయిల్ పిటీషన్ల పైన వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నేటితో చంద్రబాబు రిమాండ్(Remand) కాలం ముగియనుంది. దీంతో వర్చ్యువల్ గా కోర్టు ముందు చంద్రబాబు హాజరు కానున్నారు. న్యాయస్థానం నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
రిమాండ్ పై నిర్ణయం:సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబును వర్చ్యువల్ గా కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. తొలి విడత రిమాండ్ పూర్తయిన తరువాత ఇదే విధానంలో కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో రిమాండ్ లో ఇబ్బందులు ఉన్నాయా అని న్యాయమూర్తి చంద్రబాబును ప్రశ్నించారు. తనకు సంబంధం లేని కేసులో తనను అరెస్ట్ చేసారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, విచారణ తరువాత రిమాండ్ పొడిగింపు పైన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇదే కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్ల పైన విచారణ సాగుతోంది.

బెయిల్ పై వాదనలు:ఈ పిటీషన్ల పై ఇరువర్గాల వాదనలను విన్న ఎసిబి కోర్టు గురువారం ఉదయం 11.15 గంటలకు మిగిలిన వాదనలను వింటామని ప్రకటించింది. అంతకుముందు చంద్రబాబునాయుడుకు బెయిల్ ఇవ్వొద్దని, కస్టడీకి అనుమతించాలంటూ ప్రభుత్వం తరఫున ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ కేసులో చంద్రబాబునాయుడుకు 17ఎ వర్తించదని అన్నారు. చంద్రబాబునాయుడి పిఎ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ విదేశాలకు పరారయ్యారని పొన్నువోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. వాళ్లిద్దరూ ఐటి దర్యాప్తులో ఉన్నవాళ్లేనా కోర్టు సిఐడి న్యాయవాదిని ప్రశ్నించింది. స్కిల్ కేసులో చంద్రబాబునాయుడితో ఆర్థిక లావాదేవీలు జరపటంతోనే వాళ్లిద్దరూ విదేశాలకు వెళ్లారని పొన్నవోలు సుదాకర్‌రెడ్డి తెలిపారు.

కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబునాయుడి వైపు ఎలాంటి తప్పిదాలు లేవని ప్రమోద్‌కుమార్ దుబే వాదించారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు. ఆమె అధ్యయనం చేశాక సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రాజెక్టు ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిందని, ఆ కమిటీలో చంద్రబాబునాయుడు లేరని కోర్టు దృష్టికి తెచ్చారు. అటు సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉండటంతో చంద్రబాబు కేసుల్లో కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications