బస్సులోంచి బయటపెడితే! అమ్మాయి చేయి తెగిపడింది, తలకు తీవ్రగాయం
కృష్ణా: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ బాలిక కిటికీలో నుంచి వాంతి చేసుకుంటుండగా వేగంగా వచ్చిన లారీ తగిలి చేయి తెగిపడగా, తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం వెంకట్రాదిపురంలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన సజ్జా నాగసౌందర్య(12) అనే బాలిక బుధవారం సత్తుపల్లి నుంచి విజయవాడ వెళ్లే బస్సులో ప్రయాణిస్తోంది.
నూజివీడు మండలంలోని వెంకటాద్రిపురం వద్దకు వచ్చేసరికి ఆమెకు వాంతి రావడంతో చేయి, తల కిటికీ బయటకు పెట్టింది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన లారీ బస్సును రాసుకువెళ్లడంతో బాలిక చేయి మోచేయి వరకు తెగి కింద పడటమే గాక తలకు బలమైన గాయాలయ్యాయి.

కాగా, లారీ ఆగకుండా వెళ్లిపోయింది. ఆమెను 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా ప్రాథమిక చికిత్స అనంతరం తెగి పడిన చేయితో పాటు ఆమెను మెరుగైన చికిత్సకై విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పోలీసుల అదుపులు లారీ డ్రైవర్
ప్రమాదం జరిగిన వెంటనే లారీని ఆపకుండా వెళ్లిపోతున్న డ్రైవర్‌ను బస్సు డ్రైవర్ వెంబడించి నూజివీడు మండలం అన్నవరం వద్ద అడ్డుకున్నాడు. అనంతరం పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు.
నందిగామ ప్రాంతానికి చెందిన లారీ మహారాష్ట్ర నుంచి ముదినేపల్లికి లోడుతో వెళ్తోంది. లారీడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. లారీని, బస్సును స్టేషన్‌కు తరలించారు. ఏఎస్సై రాధాకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications