ఇళ్ల వ్యవహారంలో శాసనమండలిలో డైలాగ్ వార్.. అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స
ఏపీ శాసనమండలిలో ఇళ్ల వ్యవహారంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని మంత్రి విమర్శించారు. గతంలో కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. జగనన్న కాలనీలు అంటూ ప్రజలను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు.
అయితే 2014-19 మధ్య ఇళ్లు కట్టిన వారికి వైసీపీ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవం అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చామని.. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదని బదులిచ్చారు. రాజకీయ కక్ష్యలతో ఇవ్వలేదని చెప్పటం సరికాదని బదులు ఇచ్చారు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్ని పథకాలు ఇచ్చిందన్నారు.

తమ పార్టీ వారికే పనులు, పథకాలు ఇవ్వాలని అప్పటి సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని.. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలని ఫైర్ అయ్యారు. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా అని ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన భాధ్యత ప్రభుత్వానికి ఉందని.. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా అని ఎద్దేవా చేశారు.
దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. కేంద్రం డబ్బులతోనే కథంతా నడిపారన్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తాము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, మీరెంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తెచ్చామన్నారు అచ్చెన్నాయుడు. గాలి ఉన్నా లేకున్నా తాను ప్రజా జీవితంలో ఉన్నానన్నారు.
ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సవాల్ విసిరారు. ఎమ్మెల్యే, మంత్రివి అయ్యావని, అవ్వడానికి ఇంకా ఏమీలేదన్నారు బొత్స. 2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు మంత్రి. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ఊళ్లకు ఊళ్లు జగనన్న కాలనీలు అన్నారని, దాని గురించి తాను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదన్నారు. ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు.












Click it and Unblock the Notifications