కువైట్‌లో కాకినాడ మహిళపై యాసిడ్ అటాక్..
భర్త మరణంతో కుటుంబానికి ఆమె అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. అందుకే కష్టం అయినా కానీ జీవనోపాధి కోసం కువైట్ పయనం అయ్యింది. రెండు నెలల క్రితం వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తే 150 దీనార్లను వేతనంగా ఇస్తారని ఒప్పందం కుదిరింది. కట్ చేస్తే ఇస్తామని హామీ ఇచ్చిన జీతం ఇవ్వకపోవడంతో ఇదేంటని ప్రశ్నించింది. దాంతో ఆమెపై యాసిడ్ తో దాడి చేయడమే కాకుండా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. హాస్పిటల్ సిబ్బంది బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఈ విషాద గాధ వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా ఈ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ కోసం 2 నెలల క్రితం కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లారు. ఉద్యోగంలో చేరే ముందు నెలకు 150 దీనార్లు వేతనంగా ఇస్తామని చెప్పారు. అయితే తీరా అక్కడకి వెళ్లిన తర్వాత 100 దీనార్లు ఇవ్వడంతో ఇదేంటని ఆమె యజమానులను ప్రశ్నించింది.

దాంతో వారు కోపంతో లక్ష్మిపై యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్పించారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు కోలుకున్న తర్వాత జరిగిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పింది. దీంతో వారు ఆమెతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అలాగే, కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే లక్ష్మి పాస్‌పోర్టు యజమానుల వద్ద ఉండిపోవడంతో, తమపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటేనే దానిని తిరిగి ఇస్తామని వేధిస్తున్నట్టు లక్ష్మి వాపోతుంది.
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఆసుపత్రిలోనే మగ్గిపోతోంది ఆ మహిళ. లక్ష్మిని కువైట్‌కు పంపిన ఏజెంట్‌ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి లక్ష్మిని ఆదుకోవాలని.. స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications