మహిళపై యాసిడ్ దాడి: బావర్చీ హోటల్లో అగ్నిప్రమాదం
విశాఖపట్నం/ హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. గురువారం ఉదయం గొలుగొండ మండలం ఎస్సీ కాలనీకి చెందిన ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు. యాసిడ్ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆమెను కేజీహెచ్‌కు తరలించారు.
మహిళ శరీరం ఎనభైశాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల కారణంగా బాధితురాలికి మామ వరస అయిన వ్యక్తి ఈ దాడికి పాల్పడి ఉంటాడని బాధితురాలి తరపు బందువులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సికింద్రాబాద్‌లోని గ్రీన్‌బావర్చీ హోటల్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ సిబ్బంది అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వారు అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
గురువారం ఉదయం వంటగదిలో పొయ్యి వెలిగించగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వంటగదిలోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించలేదన్న కారణంపై హోటల్‌కు తాళం వేశారు.












Click it and Unblock the Notifications