వీధి కుక్కలపై యాక్షన్ ప్లాన్ మొదలైంది!
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశంలో వీధి కుక్కల బెడద ఆందోళనకరంగా మారుతున్న క్రమంలో కీలక ఆదేశాలను జారీ చేసిన సుప్రీంకోర్టు జన సమర్థ ప్రదేశాలలో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రజల భద్రతను, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బస్సు, రైల్వేస్టేషన్ల వంటి ప్రాంతాలలో వీధి కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
వీధి కుక్కల విషయంలో కీలక నిర్ణయం
ఈ ప్రదేశాలలో కుక్కలు ప్రవేశించకుండా కంచెలు ఏర్పాటు చేయాలని, అవి రాకుండా చూసుకోవాలని, క్రమం తప్పకుండా తనిఖీలు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలను షెల్టర్ లకు తరలించి, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని ధర్మాసనం సూచించింది. ఆపరేషన్ల తర్వాత పట్టుకున్న చోటనే వదిలి పెట్టకూడదని, వాటిని షెల్టర్ లలోనే ఉంచాలని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.

వీధి కుక్కలు, పశువుల తరలింపుకు యాక్షన్ ప్లాన్
ఈ క్రమంలో ఏపీ, తెలంగాణా వ్యాప్తంగా అన్నిచోట్ల వీధి కుక్కల నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక వీధి కుక్కల విషయంలోనే కాదు జాతీయ, రాష్ట్ర రహదారుల పైన తిరుగుతున్న పశువుల విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది. ఈ పశువులు వాహనదారులకు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.
మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల ద్వారా వీధి కుక్కల తరలింపు
కుక్కలను కూడా షెల్టర్ లకు తరలించి ఆహారం,నీరు అవసరమైన వైద్యం అందించాలని, రహదారుల పైన హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ప్రదర్శించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల ద్వారా వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. అన్నిచోట్ల యాక్షన్ ప్లాన్లను రూపొందించి కుక్కలను నియంత్రించనున్నారు. సుప్రీంకోర్టు పేర్కొన్న ఆయా సంస్థల నుండి వీధి కుక్కలను రెండువారాల గడువులో తరలించాలని ఆదేశించింది.
8 వారాల్లో కంచెలు, గేట్లు, నిర్మించుకోవాలని ఆదేశం
తమ ప్రాంగణాలలోకి కుక్కలు రాకుండా ప్రహరీలు, కంచెలు, గేట్లు నిర్మించుకునే పనులను 8వారాల్లో పూర్తి చేయాలని పేర్కొంది. వీధి కుక్కలకు ఆహారం అందించడానికి స్థానిక సంస్థలు ప్రత్యేకంగా ఫీడింగ్ ఏర్పాట్లను చేయాలని కూడా పేర్కొంది. మొత్తానికి రోడ్లమీద సంచరించే జంతువులు, వీధి కుక్కలు, పశువుల నియంత్రణకు సుప్రీం ఇచ్చిన కీలక ఆదేశాలతో ఏపీ, తెలంగాణా వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలలోనూ అధికారులు. యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నారు.












Click it and Unblock the Notifications