ఆలీకి దక్కే పదవి ఖరారు..!! సీఎంతో భేటీ సమయంలో : చివరి నిమిషం దాకా..!!
ప్రముఖ సినీ నటుడు ఆలీకి సీఎం జగన్ ఇవ్వబోతున్న పదవి ఏంటి. దీని పైన ఆలీకి ఎటువంటి సంకేతాలు అందాయి. రాజ్యసభకు ఆలీ వెళ్లబోతున్నారా. ఇప్పుడు ఇదే చర్చ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో సినీ సమస్యలపైన సీఎం జగన్ చిరంజీవి టీం సమావేశమైప సమయంలో ఆలీ సైతం హాజరయ్యారు. ఆ సమయంలో వచ్చే వారం కలవాలంటూ ఆలీకి సీఎం జగన్ స్వయంగా సూచించారు. దీంతో.. తన మ్యారేజ్ డే కూడా కలిసి రావటంతో మంగళవారం ఆలీ సతీ సమేతంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ను కలిసారు.

ఆలీకి ప్రాధాన్యత కల్పించే యోచనలో
ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ రెండో వారాల్లో తనకు దక్కే పదవి పైన పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన వస్తుందని చెప్పుకొచ్చారు. తాను పదవుల కోసం పార్టీలో పని చేయటం లేదన్నారు. తనకు వైఎస్సార్ పాదయాత్ర సమయం నుంచి ఆ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆఫర్ వచ్చినా..సమయం సరి పోదనే కారణంతో తాను వద్దని చెప్పానంటూ వివరించారు. ఇక, జగన్ తో తనకు ఇప్పటి అనుబంధం కాదని వివరించారు. దీంతో..ఇక, ఏపీ నుంచి త్వరలో భర్తీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లతో ఒకటి ఆలీకి ఖాయమనే ప్రచారం కొద్ది రోజులుగా పార్టీలో సాగుతోంది. సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే సీఎం జగన్ మైనార్టీ వర్గానికి రాజ్యసభ సీటు ఆలీ ద్వారా భర్తీ చేస్తారనే అంచనాలు వినిపించాయి.

సినీ ఇండస్ట్రీ..మైనార్టీ వర్గానికి
సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి...మైనార్టీ వర్గం కావటంతో..రాజ్యసభకు ఎంపిక చేయటానికి సమీకరణాలు సైతం సహకరిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, ఇక..తాజా భేటీలో సీఎం జగన్ త్వరలోనే కీలక బాధ్యత అప్పగిస్తాననే విధంగా ఆలీకి సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా.. రాజ్యసభ కు పంపిస్తున్నట్లుగా ఎక్కడా తనకు చెప్పలేదని ఆలీ స్పష్టం చేసారు. అయితే, రాష్ట్రంలో కీలకమైన మరో పదవి ఆయనకు అప్పగిస్తారనే సమాచారం అందుతోంది. అందులో భాగంగా.. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సినీ నటుడు అలీని నియమిస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల నుంచి అందుతున్న సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

రాజ్యసభ కాకుంటే అదే పోస్టు ఖాయం
అయితే, రాజ్యసభ సీటు పైన ఆలీకి సంకేతాలు ఉన్నాయనేది ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్న అంశం. అయితే, వైసీపీలో రాజ్యసభ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఇప్పటికే నాలుగు సీట్లలో ఒకటి విజయ సాయిరెడ్డి.. రెండోది ఉత్తరాదికి చెందని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త సిఫార్సుకు ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి మైనార్టీ రెండోది బీసీ ఇవ్వాలనేది సీఎం జగన్ లెక్కగా చెబుతున్నారు. కానీ, ఇప్పుడు అందులో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..రాజ్యసభకు చివరి నిమిషంలో ఆలీ కీ సాధ్యం కాకుంటే, ఆయనకు కీలకమైన వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ పోస్టు భర్తీ కాలేదు.

పదవితో పాటుగా అసెంబ్లీ సీటు
గతంలో చంద్రబాబు హాయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా పని చేసిన జలీల్ ఖాన్ కు కేటాయించారు. ఇక, ఆలీకి రాజ్యసభ ఇచ్చి జగన్ అటు సినీ పరిశ్రమ..ఇటు మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపక్షాలకు మరో షాక్ ఇస్తారా.. లేక, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఇప్పుడు అవకాశం కల్పించి.. 2024 ఎన్నికల్లో ఆలీకి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి. అయితే, ఇప్పుడు రాజ్యసభ కాకుండా నామినేటెడ్ పదవి ఇస్తే ..2024 ఎన్నికల్లో మాత్రం ఆలీకి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా సీటు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే..ఆలీ సైతం 2019లో తనకు అసెంబ్లీ సీటు ఆఫర్ ఇచ్చారనే విషయాన్ని బయటకు వెల్లడించనట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తంగా..ఆలీకి ఇవ్వబోయే పదవి గురించి ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications