ఏపీకి శ్రీవారి దయ: నిన్న అలా, నేడు టీడీపీ నేతకు నటుడు శివాజీ కితాబు
చిత్తూరు: నటుడు, ప్రత్యేక హోదా సాధనా సమాఖ్య అధ్యక్షుడు శివాజీ శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఏడు కొండల వాడి దయ కావాలని ఆకాంక్షించారు. ఆయన ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన తిరుమల తిరుపతి అభివృద్ధి పైన హర్షం వ్యక్తం చేశారు. గతంలో కంటే భిన్నంగా తిరుపతి ఉందని కితాబిచ్చారు. టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తిరుమలలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు అద్బుతంగా జరుగుతున్నాయన్నారు. టిటిడికి ఇలాంటి చైర్మన్లు కావాలన్నారు. ఏపీని ఏడు కొండలవాడు చూసుకోవాలన్నారు.

కాగా, శివాజీ గతంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం నేపథ్యంలో ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. హోదా విషయంలో బీజేపీ తప్పు చేస్తోందని ఆయన పలుమార్లు మండిపడ్డారు. హామీ ఇచ్చిన మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
లేదంటే ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ తదితరుల పైన కూడా ఆయన నిప్పులు చెరిగిన సందర్భాలు ఉన్నాయి.
అదే సమయంలో శివాజీ టిడిపి నేతల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు టిటిడి చైర్మన్ పైన ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతంలో ప్రత్యేక హోదా గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ కోసం చంద్రబాబు పాటుపడుతున్నారని, ఆయనకు అండగా కేంద్రం ఉండాలని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు చదలవాడ కృష్ణమూర్తిని ఆకాశానికెత్తారు.












Click it and Unblock the Notifications