నిన్న అలా.. నేడు: జయసుధ కోసం జయప్రద రోడ్డు షో
హైదరాబాద్: ప్రముఖ నటి, ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ లోకసభ నియోజకవర్గం నుండి రాష్ట్రీయ లోకదళ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జయప్రద ఆదివారం తోటి నటి, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధ తరఫున ప్రచారం చేశారు. సికింద్రాబాదులో ఓ మహిళా ఎమ్మెల్యేగా ఐదేళ్లు సేవలందించిన జయసుధకు మరోసారి అవకాశం ఇవ్వాలని జయప్రద ఓటర్లను కోరారు.
ఆదివారం జయప్రద... సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ అసెంబ్లీ అభ్యర్థి జయసుధలకు మద్దతుగా అడ్డగుట్ట నుండి తుకారాంగేట్ వరకు రోడ్డు షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధఈల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఎవరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. మరోసారి అంజన్, జయసుధలను గెలిపించాలన్నారు.
కాగా, జయప్రద శనివారం వరంగల్, నల్గొండ జిల్లాల్లో పర్యటించి ఆర్ఎల్డీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ జిల్లాల పర్యటనలో ఆమె టిఆర్ఎల్డీ అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెసు, టిడిపి, తెరాసలను ఓడించాలని పిలుపునిచ్చారు. భువనగిరి ఎంపీగా కపిలవాయి దిలీప్ కుమార్, ఆలేరు ఎమ్మల్యే అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్‌లను గెలిపించాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications