కెవిపి బండారం బయటపెడ్తా, వివేకా జోకర్: ఆదాల
హైదరాబాద్: కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో డీల్ కుదుర్చుకున్నారని ఆనం వివేకాంద రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
ఆనం వివేకానంద రెడ్డి ఓ జోకర్ అని ఆయన ధ్వజమెత్తారు. ఆనం సోదరులు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు శిష్యులని, ఆనం సోదరులతో కెవిపియే మాట్లాడిస్తున్నారని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కెవిపి బండారం బయటపెడతానని హెచ్చరించారు. సమైక్యవాదమంటున్న ప్రతి శాసనసభ్యుడిని ఓటు అడుగుతానని ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ పార్టీ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో డీల్ కుదుర్చుకున్నారని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఆరోపించారు. జగన్‌తో 55 కోట్ల రూపాయలకు ఆదాల డీల్ కుదుర్చుకున్నట్లు ఆయన ఆరోపించారు. అందుకే ఆదాల రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కుదిరిన ఒప్పందం మేరకు ఆదాల ప్రభాకర్ రెడ్డిని తమ పార్టీ అధికారిక అభ్యర్థిగా వైయస్ జగన్ తన పార్టీ ప్లీనరీలో ప్రకటించబోతున్నారని ఆయన అన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి తన సమీప బంధువు ద్వారా వైయస్ జగన్‌తో రాయబారం నడిపారని ఆయన అన్నారు. ఆ సమీప బంధువు ఎవరనే విషయం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications