శ్రీశైలం మల్లన్న ఆలయంపై చక్కర్లు కొట్టిన విమానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం పై విమానం చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. శ్రీశైలంలో చిన్నపాటి విమానం చక్కర్లు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయానికి అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ ఓ విమానం కనిపించింది .
ఈ విమానం ఆలయ పరిధిలోనే నాలుగైదు రౌండ్లు తిరిగింది. అయితే దీనిని ఎవరు శ్రీశైలం ఆలయం పై తిప్పారు అన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతం శ్రీశైలం ఆలయం పై విమానం చక్కర్లు కొట్టడం భక్తులకు, స్థానికంగా ఉండే ప్రజలకు భయాందోళన కలిగిస్తుంది.

గతంలోనూ శ్రీశైలం ఆలయం పై డ్రోన్ చక్కర్లు కొట్టడం అప్పట్లో కలకలం రేపింది. గతంలో వరుసగా నాలుగు రోజుల పాటు ఆకాశంలో సంచరించిన డ్రోన్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్వార్టర్స్, ఔటర్ రింగ్ రోడ్, మల్లన్న కన్నీరు, ఉత్తరా పార్క్, విశ్వామిత్ర మఠం, రిజర్వాయర్ మరియు కొన్ని ఇతర సైట్లను చిత్రీకరించినట్లు అనుమానించారు.
గతంలో తిరుమలలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకోగా, ఆలయాలపై విమానాలు, డ్రోన్లు తిరగడాన్ని నిషేధించాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఆకాశంలో విమానం ఆలయానికి అతి సమీపంగా తక్కువ ఎత్తులో తిరగడం చూసిన భక్తులు, స్థానికులు ఆలయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే శ్రీశైలం ఆలయం పై విమానం చక్కర్లు కొట్టడం తమకు తెలియదని శ్రీశైలం ఆలయ అధికారులు, పోలీసులు, స్థానిక తాహసిల్దార్ పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని, ఆలయాలపై భవిష్యత్తులో ఎటువంటి అనుమానాస్పద విమానాలు, డ్రోన్లు తిరగకుండా కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం ను 'నో ఫ్లై' జోన్‌గా ప్రకటించాలని బిజెపి ఎంతో కాలంగా డిమాండ్ చేస్తుంది.












Click it and Unblock the Notifications