టీచర్ల పీఆర్సీ ఉద్యమం మరింత తీవ్రం: యూటీఎఫ్ కూడాకటీఫ్?
అమరావతి: రాష్ట్రంలో పీఆర్సీ వివాదం సద్దుమణగట్లేదు. పీఆర్సీ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యోగ సంఘాల నాయకులు.. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త హెచ్‌ఆర్ఏ.. ఇతర అంశాలతో సంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ- ఉపాధ్యాయులు మాత్రం దీనికి అంగీకరించట్లేదు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలతో వారు ఏకీభవించట్లేదు. తమ నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నారు. దీన్ని మరింత తీవ్రతరం చేయనున్నారు.
Recommended Video

ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ కార్యాచరణ..
ఇందులో భాగంగా- ఇన్నాళ్లూ ఏపీ ఉద్యోగల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులతో కలిసి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులు వేరుపడనున్నారు. ఏపీ ఎన్జీవో నుంచి బయటికి రానున్నారు. ఇప్పటికే ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఏపీ ఎన్జీవోకు గుడ్‌బై చెప్పారు. ఇక యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు కూడా కటీఫ్ చెప్పనున్నారు. ఇవ్వాళ వారంతా రాజీనామాలు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఏపీటీఎఫ్ ఇదివరకే
ఏపీజేఏసీలో భాగంగా ఉంటూ వస్తోన్న ఏపీటీఎఫ్ విభాగం అధ్యక్షుడు, ఇతర కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ రాజీనామా పత్రాలను వారు జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ రావుకు పంపించారు. తమ డిమాండ్ల పరిష్కారంలో జేఏసీ విఫలమైందనేది వారి ప్రధాన ఆరోపణ. సీపీఎస్ రద్దు, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంశాన్ని జేఏసీ నాయకులు సమర్థవంతంా పరిష్కరించలేక పోయారని ఏపీటీఎఫ్ నాయకులు చెబుతున్నారు.

పీఆర్సీలో అన్యాయం..
పీఆర్సీ వ్యవహారంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని విమర్శిస్తోన్నారు. దీనికోసం తాము ప్రత్యేకంగా ఉద్యమిస్తామని, జేఏసీతో సంబంధం లేకుండా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఏపీటీఎఫ్ నేతలు స్పష్టం చేశారు. తాజాగా అదే బాటలు యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా ప్రయాణించనుంది. యుటీఎఫ్ నేతలు ప్రభుత్వంతో సాగిన చర్చల పట్ల అసంతృప్తితో ఉంటున్నారు. ప్రభుత్వం సవరించిన పీఆర్సీని తాము అంగీకరించట్లేదని అన్నారు.

12 శాతానికి..
ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు అందరికీ ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేశారు. అందుకే ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ప్రకటించిన 10 శాతం హెచ్ఆర్ఏను తాము ఏ మాత్రం అంగీకరించట్లేదని అన్నారు. ఈ హెచ్ఆర్ఏను కనీసం 12 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. దానికి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పాత హెచ్ఆర్ఏను కొనసాగించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తోన్నారు.

ముగిసి పోయిన అధ్యయంగా..
పీఆర్సీ అనేది ముగిసిపోయిన అధ్యాయం అని మంత్రులు స్పష్టం చేసిన ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ బాట పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీటీఎఫ్, యూటీఎఫ్ రాజీనామాలు, ఆయా ఫెడరేషన్ల నాయకుల డిమాండ్లకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రులు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వారిని చర్చలకు ఆహ్వానిస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications