స్టీల్ ప్లాంట్ పై చెబుతుందేంటి, జరుగుతుందేంటి..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇదే సమంలో కేంద్రం సెయిల్ లో స్టీల్ ప్లాంట్ ను విలీనం దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇది కొనసాగుతున్న సమయంలోనే భారీ స్థాయిలో ప్లాంట్ లోని కాంట్రాక్టు కార్మికుల తొలిగింపు పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల విషయంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోంది. రాజకీయంగానూ ఎన్డీఏ పైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలోనే కేంద్రం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఆర్దికంగా తాజాగా కొంత మేర వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, పూర్తిగా ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం నిలుపుదల చేయాలని కార్మికులు పట్టుబడుతున్నారు.

ఇదే సమయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస రాజు కేంద్రంలోని ముఖ్యులతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్ పైన కీలక మంత్రాంగం చేసారు. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా సెయిల్ లో స్టీల్ ప్లాంట్ విలీనం దిశగా ప్రతిపాదనలు వచ్చాయి. దీని పైన తుది చర్చల తరువాత కేంద్రం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. ఈ వార్తలు వస్తున్న సమయంలోనే ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 2500 మందికి ఆఫర్ ఇచ్చారు. దీని కోసం 14 వేల కోట్లు కేటాయించారు. 500 మందిని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. దీంతో, కార్మిక సంఘాలు మరోసారి ఆందోళనకు దిగాయి. దీంతో, ప్లాంట్ యాజమాన్యం ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ భవితవ్యం పైన ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుందో స్పష్టత ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications