రోడ్డు ప్రమాదం: విద్యార్థిని రవళి తల్లిదండ్రులకు గాయాలు
హైదరాబాద్: తమ కూతురుపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడన్న సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులు బైకుపై హుటాహుటిన ఆమె వద్దకు బయల్దేరారు. కాగా, మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న బైకు స్కిడ్ అయి పడిపోవడంతో వారికి గాయాలయ్యాయి. ఇదంతా సోమవారం ఓ ప్రబుద్ధుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన రవళి, ఆమె తల్లిదండ్రుల గురించి.
వివరాల్లోకి వెళితే నగరంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన ఎం గోపీదేవ్, లలితకు ఉదయం 9గంటల ప్రాంతంలో ఓ ఫోన్ వచ్చింది. తమ కూతురిపై కాలేజీ వద్ద ఓ యువకుడు వేటకొడవలితో దాడి జరిగిందన్న సమాచారం. అత్తాపూర్ సుజాత ఆస్పత్రిలో ఆమెను చేర్చినట్లు తెలిసింది. దీంతో వెంటనే వాళ్లు ఆదుర్దాగా ఆస్పత్రికి బయల్దేరారు.

ఇంతలో వాళ్లు ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అయి పడిపోయారు. గాయాలపాలుకావడంతో వారిని వేరే ఆస్పత్రిలో చికిత్స చేయించారు. దీంతో కొన్ని గంటల తర్వాత గానీ, వాళ్లు తమ కుమార్తె రవళిని చూడలేకపోయారు. రవళి ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
కాగా, ఆమె పోలీసులతో మాట్లాడి, తనపై జరిగిన దాడి వివరాలు చెప్పింది. రవళిపై వేట కొడవలితో దాడి చేసిన ప్రదీప్.. కళాశాల సిబ్బంది, విద్యార్థులు అడ్డుకోవడంతో విషం తాగిన విషయం తెలిసిందే. దీంతో అతడ్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు పాల్పడిన ప్రదీప్, సోమవారం ఉదయం కళాశాలకు వెళ్ళిన రవళిపై వేటకొడవలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత కళాశాల విద్యార్థులు, సిబ్బంది అడ్డుకోవడంతో వారిపై దాడి చేసిన ప్రదీప్.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications