కర్నూలు ఎఫెక్ట్..! ఏపీ వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు షాక్..!
ఏపీలో నిన్న తెల్లవారుజామున జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో ఈ ఘటనకు కారకుల్ని గుర్తించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉంది. అదే సమయంలో ఇలాంటి బస్సులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని ముందస్తు చర్యలు తీసుకునేందుకు వీలుగా అధికారులు రంగంలోకి దిగారు. దీంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేపట్టింది.
రవాణా కమిషనర్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు మొదలయ్యాయి. దీంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు బెంబేలెత్తుతున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయా లేదా ఉల్లంఘనలు ఉన్నాయా అన్న అంశాలపై చేపట్టిన తనిఖీలతో ఆపరేటర్లు బస్సులు బయటికి తీయడమే మానేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు 289 కేసులు నమోదు చేశారు. అంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే 18 బస్సుల్ని సీజ్ చేసి 7 లక్షలకు పైగా జరిమానాలు వసూలు చేశారు.

రాష్ట్రంలో ఇవాళ జరిపిన తనిఖీల్లో అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు చేసి 3 బస్సులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు చేసి 4 బస్సులు సీజ్ చేశారు. కోనసీమ జిల్లాలో 27 కేసులు, చిత్తూరు జిల్లాలో 22 కేసులు, కర్నూలు జిల్లాలో 12 కేసులు, విశాఖ జిల్లాలో 7 కేసులు, నంద్యాలలో 4 కేసులు నమోదు చేశారు. వీటిలో సరైన పత్రాలు లేకపోవడం, ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం, పైర్ ఫైటింగ్ పరికరాలు లేకపోవడం, పాసింజర్ లిస్ట్ లేకపోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లపై జరుపుతున్న దాడుల్లో ఉల్లంఘనలు బయటపడుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పలు చోట్ల తనిఖీల భయంతో బస్సులు నడపకుండా షెడ్లలో పెట్టేశారు. దీంతో వారాంతంలో ప్రయాణాలు చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ఇప్పటికే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications