వేగంగా మారుతున్న ఏపీ పరిణామాలు- జగన్ విశాఖ టూర్ రద్దు-28న కేబినెట్ భేటీ
ఏపీలో టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు రేపిన చిచ్చు, ఆ తర్వాత వైసీపీ కౌంటర్ అటాక్ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టాభి ఎపిసోడ్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మైలేజ్ తీసుకోవాలని తహతహలాడుతున్న టీడీపీ.. చంద్రబాబు ఢిల్లీ టూర్ కు ప్లాన్ చేసింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత, సీఎం జగన్ తన వైజాగ్ టూర్ ను రద్దు చేసుకుని మరీ మంతనాల్లో మునిగితేలుతున్నారు. అదే క్రమంలో 28న కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. జగన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పట్టాభి ఎపిసోడ్ తర్వాత
ఏపీలో సీఎం జగన్, డీజీపీ సవాంగ్ ను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి చేసిన వివాదస్పద వ్యాఖ్యల చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పట్టాభిని వైసీపీ సర్కార్ జైలుకు పంపేసినా, వ్యాఖ్యల ప్రకంపనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యపహారంలో సాధ్యమైనంత ఎక్కువ మైలేజ్ తీసుకోవాలని భావిస్తున్న టీడీపీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. అదే సమయంలో టీడీపీ వ్యూహాలకు ఎక్కడికక్కడ కౌంటర్లు ఇచ్చేందుకు వైసీపీ కూడా రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రాబోయే రోజల్లో రాజకీయాల్లో భారీ ట్విస్టులు చోటు చేసుకునే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వేగంగా మారుతున్న పరిణామాలు
పట్టాభి ఎపిసోడ్ తదనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగడం, దానికి కౌంటర్ గా వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టడం వంటి పరిణామాలతో రాజకీయ వేడి పెరుగుతోంది. ఇందుకు తగినట్లుగానే వైసీపీ, టీడీపీ వ్యూహరచనలో మునిగితేలుతున్నాయి. అటు చంద్రబాబు, ఇటు జగన్ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పట్టాభి ఎపిసోడ్ ద్వారా మైలేజ్ పొందాలనే ఆతృతలో ఉన్న ఇరువురు నేతలు ఇప్పుడు తదుపరి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో వీరిద్దరి తదుపరి అడుగులపైనే చర్చ జరుగుతోంది.

చంద్రబాబు ఢిల్లీ టూర్
పట్టాభి ఎపిసోడ్ నేపథ్యంలో వైసీపీ నేతలు తమ కార్యాలయాలపై జరిపిన దాడులు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పట్టాభి అరెస్టు వంటి అంశాల్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నేతలతో అపాయింట్ మెంట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీ, అమిత్ షాను కలిసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అమిత్ షా కు ఫోన్ చేసి వైసీపీపై ఫిర్యాదు చేసిన చంద్రబాబుకు ఆయన అపాయింట్ మెంట్ దొరికితే మాత్రం ఏపీ రాజకీయాల్లో మరో టర్నింగ్ పాయింట్ ఖాయమని తెలుస్తోంది. గతంలో బీజేపీకి కటీఫ్ చెప్పాక అమిత్ షాతో పాటు బీజేపీ నేతలపై ధర్మపోరాటం చేసిన చంద్రబాబు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా టీడీపీని దూరం పెట్టారు. ఇప్పుడు చంద్రబాబుకు మరోసారి అపాయింట్ మెంట్ ఇస్తే మాత్రం వైసీపీలో కలవరం పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

కీలక నిర్ణయాల దిశగా జగన్
ఏపీలో పట్టాభి ఎపిసోడ్ తర్వాత మారిన పరిస్దితుల్లో చంద్రబాబు దూకుడు గమనించిన జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు దీక్షకు కౌంటర్ గా జనాగ్రహ దీక్షలు చేయించిన జగన్.. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ వ్యూహాల నేపథ్యంలో తాను కూడా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైజాగ్ లో ఇవాళ టూర్ ను కూడా జగన్ రద్దు చేసుకున్నారు. ఇందుకు గల కారణాల్ని కూడా సీఎంవో వెల్లడించలేదు. అలాగే ఈ నెల 28న కేబినెట్ భేటీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పట్టాభి ఎపిసోడ్ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ అడుగులు ఆసక్తిరేపేలా ఉన్నాయి.

పోటాపోటీగా జగన్, చంద్రబాబు
ఏపీలో మారుతున్న పరిస్ధితుల్లో చంద్రబాబు, జగన్ పోటాపోటీగా అడుగులేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకరి అడుగుల్ని గమనిస్తూ మరొకరు అడుగులేస్తున్నారు. పట్టాభి ఎపిసోడ్ తర్వాత టీడీపీని మరింత ఇరుకునపెట్టేందుకు అవసరమైన వ్యూహాల్ని జగన్ రచిస్తుంటే.. వైసీపీని జాతీయ స్ధాయిలో ఇరుకునపెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అలాగే చంద్రబాబు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరబోతుంటే.. జగన్ టీడీపీ గుర్తింపు రద్దు కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు నేతల్ని పంపబోతున్నారు. రాష్ట్రంలోనూ టీడీపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వాడుకోవాలని జగన్ భావిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో జగన్, చంద్రబాబు పోరు మరింత ఆసక్తికరంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications