ఎవర్నీ క్షమించం: చంద్రబాబుకు తెలంగాణ తర్వాత ఏపీ బీజేపీ షాక్
విజయవాడ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎవరినీ క్షమించదు, ఎవరినీ రక్షించదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో బీజేపీకి స్పష్టత ఉందని ఆయన చెప్పారు. ఈ కేసులోనే కాక ఏ కేసులోనైనా తమ పార్టీ ఎవరినీ క్షమించదని చెప్పారు.
తప్పు చేస్తే ఏ ఒక్కరిని కూడా తమ పార్టీ రక్షించదన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంకా ఉద్యమనేతగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న నిరంతర విద్యుత్ ఘనత కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ సర్కారుదే అన్నారు.
ఓటుకు నోటు అంశం రెండు తెలుగు రాష్ట్రాలను, లలిత్ మోడీ అంశం జాతీయస్థాయిలో బీజేపీని చిక్కుల్లో పడేసిన సమయంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ బీజేపీ షాకిచ్చింది. ఇప్పుడు ఏపీ బీజేపీ కూడా షాకిచ్చింది.

గురువారం నాడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి షాకిచ్చారు. ఓటుకు నోటు, సెక్షన్ 8తో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. సెక్షన్ 8 లేదని రెండు రోజుల క్రితమే కిషన్ చెప్పారు.ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై దాదాపు మౌనంగా ఉన్న బీజేపీ (తెలంగాణ) ఇప్పుడు పెదవి విప్పింది.
ఓటుకు నోటు, సెక్షన్ 8తో తమకు సంబంధం లేదని కిషన్ చెప్పారు. సెక్షఖన్ 8తో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయని చెప్పారు. దీని వల్ల ఉద్రిక్తలు తలెత్తుతాయని హెచ్చరించారు. రెండు పార్టీల సమస్యను ప్రాంతీయ సమస్యగా మార్చారని చెప్పారు. సెక్షన్ 8 కేంద్రం పరిధిలోని అంశమని చెప్పారు.












Click it and Unblock the Notifications