జగన్ కౌంటర్ అటాక్ తో బీజేపీకి చుక్కలు-గవర్నర్ కు మొర- కేంద్రంతోనే దెబ్బకు దెబ్బ
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య సంబంధాల విషయంలో ఇరు పార్టీలు పట్టుదలకు పోతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్యతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా తెరపైకి తెచ్చిన వినాయక చవితి వేడుకలకు కోవిడ్ ఆంక్షల వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే జగన్ సర్కార్ కు దీని ద్వారా ముకుతాడు వేయాలని భావించిన బీజేపీకి సీఎం జగన్ మాత్రం అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. దీంతో కాషాయ నేతలు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఏం చేయాలో తెలియక గవర్నర్ ను ఆశ్రయించారు.

బీజేపీతో జగన్
రెండేళ్ల క్రితం బీజేపీతో వైసీపీ అధినేత, సీఎం జగన్ సత్సంబంధాలు ప్రారంభమయ్యాయి. అప్పటివరకూ బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉన్న జగన్ కాస్తా బీజేపీ అధిష్టానంతో సంబంధాలు కొనసాగించడం మొదలుపెట్టారు. ఏపీ అవసరాల పేరుతో పదే పదే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తుండటం, కీలక విషయాలపై చర్చలు జరుపుతుండటంతో వారికి జగన్ ఆప్తుడిగా మారిపోయారు. అడిగినా అడగకపోయినా కీలక విషయాల్లో సాయం చేస్తుండటంతో జగన్ పై బీజేపీ దూకుడుగా ముందుకెళ్లలేదు.

బీజేపీతో పెరిగిన దూరం
కేంద్రంలోని బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా రాష్ట్రానికి వచ్చేసరికి తిరిగి కాషాయ నేతలు జగన్ సర్కార్ పై పోరుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. దీంతో కొన్నాళ్లు వేచి చూసిన జగన్, వారికి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టాలని తన కేబినెట్ మంత్రులకు సంకేతాలు ఇచ్చారు. ఇదే అదనుగా మంత్రులతో పాటు సలహాదారులు, ఎమ్మెల్యేలు బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎలాగో జగన్ అవకాశమివ్వడంతో బీజేపీ కూడా సై అంటే సై అనే ధోరణికి వచ్చేసింది. సున్నితమైన విషయాల్లో, మరపరమైన అంశాల్లో జగన్ ను పదే పదే టార్గెట్ చేస్తోంది.

గణేష్ ఉత్సవాల వివాదం
రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గలేదు. అలాంటి సమయంలో పండుగల సీజన్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెప్పడంతో గణేశ్ ఉత్సవాలపై వైసీపీ ప్రభుత్వం పలు ఆంక్షలు పెట్టింది. భారీ విగ్రహాలను అనుమతించబోమని తేల్చి చెప్పంది. అలాగే ఊరేగింపులపైనా నిషేధం విధించింది. దీంతో బీజేపీకి ఎక్కడో కాలింది. జగన్ సర్కార్ పై దాడి కోసం తమకు మరో అస్త్రం అందివచ్చిందని భావించిన బీజేపీ నేతలు.. ఇక వరుసగా ఆందోళనలు మొదలుపెట్టారు ప్రతీ ఆందోళనలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కనిపించడం ఎక్కువైంది. దీంతో వైసీపీ సర్కార్ కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టేసింది.

దిమ్మతిరిగేలా వైసీపీ కౌంటర్ అటాక్
బీజేపీ నేతలు గణేష్ ఉత్సవాల సందర్భంగా కోవిడ్ ఆంక్షలపై నిరసనలకు దిగుతుండటం, ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తుండటంతో వైసీపీ కూడా అప్రమత్తమైంది. బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించింది. బీజేపీ నేతల చర్యలు, వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అక్కడే వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ వ్యాఖ్యలకు ఏదో సాధారణ కౌంటర్లతో సరిపెట్టకుండా అదను చూసి కొడుతోంది. దీంతో బీజేపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారు. ముఖ్యంగా కేంద్రాన్ని లాగుతూ వైసీపీ చేస్తున్న అటాక్ కు బీజేపీ నేతల వద్ద సమాధానం లేదు.
Recommended Video

గవర్నర్ కు మొర పెట్టుకున్నా..
వైసీపీ సర్కార్ గణేశ్ ఉత్సవాల విషయంలో కోవిడ్ ఆంక్షలు పెట్టడంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఎదురుదాడి ప్రారంభం కావడంతో వారు సహజంగానే డిఫెన్స్ లో పడ్డారు. అదీ కేంద్రాన్ని ఇందులోకి లాగుతూ వైసీపీ చేస్తున్న కౌంటర్ అటాక్ తో వారికి ఊపిరాడటం లేదు. దీంతో చేసేది లేక గవర్నర్ హరిచందన్ ను ఆశ్రయించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం నియమించిన గవర్నరే కావడంతో ఆయనకు మొరపెట్టుకున్నారు. కానీ ఆయన నుంచి కూడా వారికి నిర్దిష్ట హామీ ఏదీ లభించలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్రం తీసుకున్న కోవిడ్ ఆంక్షల నిర్ణయాన్నే రాష్ట్రంలో జగన్ అమలు చేస్తుండటమే. దీంతో అటు కేంద్రానికి చెప్పే పరిస్ధితి లేక, ఇటు జగన్ కు చెప్పలేక గవర్నర్ కూడా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ నేతలు ఏం చేయబోతున్నారో చూడాలిక.












Click it and Unblock the Notifications