రుణమాఫీ, రాజధాని: బాబుకు తలనొప్పి, జగన్ సిద్ధం..
హైదరాబాద్: రైతుల రుణ మాఫీ, రాజధానికి సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సతమతమవుతున్నారట. పోలవరం, విద్యుత్ అంశాలపై అనుసరించిన వ్యూహాత్మక వైఖరి పట్ల సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. రాజధాని, రుణమాఫీ మాత్రం ఇబ్బంది పెడుతున్నట్టే కనిపిస్తున్నాయంటున్నారు.
చంద్రబాబు అనుసరించిన దూకుడు వల్లే పోలవరం ఆర్డినెన్సు వచ్చిందని, విద్యుత్ పంపకాల్లో ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగలిగారన్న పేరు వచ్చింది. కానీ రైతు రుణమాఫీపై విధివిధానాల ఖరారుకు నియమమించిన కోటయ్య కమిటీ, రాజధాని కోసం కేంద్రం ఏర్పాటు చేసిన రిటైర్డు ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వచ్చే వరకు చంద్రబాబు ఈ రెండు అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేరు.

సోమవారం చంద్రబాబు బ్యాంకర్లతో పూర్తిస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఖరీఫ్ రుణాలతోపాటు, రైతు రుణమాఫీ, పరిశ్రమలకు రుణాల తదితర అంశాలను సమీక్షించనున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా రైతు రుణమాఫీపై చంద్రబాబు అనుసరించే విధానంపై వేచి చూస్తోంది. రుణమాఫీ జరగకపోతే వామపక్షాలతో కలిసి పెద్ద ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. రైతు రుణమాఫీ అంశం ఎన్నికల్లో చంద్రబాబుకు తురుపుముక్కలా ఉపయోగపడింది.
రైతు రుణమాఫీ ఇబ్బందులతో కూడుకున్న అంశం. దాదాపు 59 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. కోటయ్య కమిటీ ఈ అంశంపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్‌ను కలిసినా ఆశాజనకమైన సమాధానం రాలేదు. చంద్రబాబు రెండుసార్లు లేఖ రాశారు. కానీ రిజర్వ్ బ్యాంక్ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. చంద్రబాబు జూన్ 8న గుంటూరు - విజయవాడ మధ్య నాగార్జున వర్శిటీ ఎదుట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండుసార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు.
కేంద్రం నుంచి రైతు రుణమాఫీపై ఎటువంటి స్పష్టత రాలేదు. కోటయ్య కమిటీ 45రోజుల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంది. వచ్చే నెల 25 వరకు గడువున్నా, జూన్ 12 లోపలే ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నివేదిక వచ్చిన తర్వాతే రుణమాఫీపై చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందు రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయించి, కొంత ఉపశమనం పొందే యోచనలో బాబు సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం రుణాల మాఫీ దిశగా అడుగులు వేయవచ్చునని అంటున్నారు.
ఇక రాజధాని అంశం చంద్రబాబును ఇరకాటంలో పెడుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే రాజధానిని ఏర్పాటు చేయాలనే యోచనతో చంద్రబాబు సర్కారు ఉంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మాత్రం ఆగస్టు 10న వస్తుంది. అంటే మరో 40 రోజులు వేచి చూడాలి. ఈ కమిటీ ఇంతవరకు ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పర్యటించలేదు. ఈ కమిటీ అక్కడ పర్యటించకుండా రాజధానిని ప్రకటించడం భావ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఈ లోపల విజయవాడ రాజధాని అంటూ రియల్ ఎస్టేట్ రంగం అక్కడ ఊపందుకోవడంతో సామాన్యులు, మధ్యతరగతి వర్గానికి అందుబాటులో లేనంత విధంగా ఇళ్ల స్థలాలు, రేట్లు పెరిగాయి. మిగతా ప్రాంతాల నేతలు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొస్తున్నారు. తిరుపతిలో టిడిఎల్‌పి ఎన్నిక, గుంటూరులో ప్రమాణ స్వీకారం, విశాఖలో తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15 వేడుకలను కర్నూలులో నిర్వహించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications