తిరుమలలో ట్రయల్ రన్: శ్రావణ పౌర్ణమి నాడే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 71,144 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,889 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.15 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు పంపిణీ చేశారు.

ఈ నెల 9వ తేదీన పవిత్రమైన శ్రావణ పౌర్ణమి. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరుగనుంది. దీనికి తిరుమల ముస్తాబైంది. ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనారూఢుడై ఊరేగుతారు. శ్రీదేవి, భూదేవితో కలిసి తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు కరుణిస్తారు.
ప్రతి పౌర్ణమి నాడు ఈ ఉత్సవం జరిగేదే అయినప్పటికీ- ఈ సారి కొంత ప్రత్యేకత ఉంది. దీన్ని ట్రయల్ రన్ గా నిర్వహించబోతోంది టీటీడీ. ఈ గరుడ సేవ- శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో నిర్వహించే అత్యంత ప్రాముఖ్యత గల గరుడ సేవకు ముందు జరుగబోతోంది.
అందుకే దీన్ని ట్రయల్ రన్‌గా నిర్వహించనుంది. ఇందులో ఎటువంటి లోటుపాట్లు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటుంది. తిరుమాడ వీధుల్లో ఇదే మాదిరిగా మళ్లీ వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడసేవను నిర్వహించాలనేది టీటీడీ ఉద్దేశం. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడురోజులపాటు నిర్వహించబడే పవిత్రోత్సవాలు గురువారంనాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. తొలి రెండురోజుల్లాగానే గురువారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు.
తరువాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.
కాగా గురువారం మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.












Click it and Unblock the Notifications