టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ఉన్నారు: సెక్స్ రాకెట్‌పై అఖిలప్రియ
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి, ఎమ్మార్వో వనజాక్షి ఉదంతాల్లో, ఇప్పటి కాల్ మనీ, సెక్స్ రాకెట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాత్ర ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఆర్థిక భారాల నుంచి బయటపడాలని భావించి అప్పులు తీసుకున్న మహిళలపై దురాగతాలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు.
శాసనసభ సమావేశంలో పది నిమిషాల పాటు వాయిదా పడిన తర్వాత ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. మహిళలను సెక్స్ రాకెట్‌లోకి లాగడం బాధాకరమని ఆమె అన్నారు. మహిళలకు న్యాయం చేసే మార్గంలో వెళ్లకుండా నిందితులతో జగన్ ఫొటోలున్నాయంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎదురు దాడికి దిగుతున్నారని ఆమె అన్నారు. మహిళల పట్ల గౌరవం, చిత్తశుద్ధి ఉంటే కాల్ మనీ వ్యవహారంపై విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాల్ మనీ పేర మహిళలను వేధిస్తూ వారిని సెక్స్ రాకెట్‌లో దింపడంపై వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ నైజాన్ని తెలియజేస్తోందని మరో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు అసహ్యం పేరుకుపోతోందని ఆమె అన్నారు. అవినీతికి అండగా చంద్రబాబు నిలబడుతున్నారని ఆమె ఆరోపించారు.
వనజాక్షి విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించిందని, అన్ని విషయాలు తెలిసి కూడా చంద్రబాబు సరిగా వ్యవహరించడం లేదని ఆమె అన్నారు. అరాచకాలు చేస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications