జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కొత్త లెక్కలు - అభ్యర్ధి ఫిక్స్, ఢిల్లీ మార్క్ ఎంపిక..!!
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారయ్యారు. పార్టీ అధినాయకత్వం ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. గెలుపు సాధించాలని నిర్దేశించింది. అటు బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణికి ఇవ్వటంతో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడింది. బీజేపీ అభ్యర్ధి ఎవరనేది ఆరా తీసింది. టీపీసీసీ ప్రతిపాదిస్తున్న అభ్యర్ధుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఫైనల్ గా ఢిల్లీకి నలుగురు పేర్లు ప్రతిపాదించారు. అయితే, అక్కడే కాంగ్రెస్ నాయకత్వం తన మార్క్ నిర్ణయం ఏంటో వెల్లడించింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారింది. ఎలాగైనా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అటు బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. గోపీనాథ్ సతీమణిని బరిలోకి దించింది. ప్రచారం సైతం ప్రణాళికా బద్దంగా కొనసాగిస్తోంది. బీజేపీ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. టీడీపీ మద్దతుతో కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ బాధ్యతలను ముగ్గురు మంత్రులకు అప్పగించారు. ప్రచార వ్యూహాలను ఖరారు చేసారు. ఇక్కడ ఎంఐఎం కీలకంగా మారుతోంది. ఇదే నియోజకవర్గం నుంచి తాను తిరిగి పోటీ చేయాలని భావించిన అజాహరుద్దీన్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు. అయినా, అజాహరుద్దీన్ పట్టు వీడటం లేదు.

ఎమ్మెల్సీ విషయంలో కొన్ని సాంకేతిక అంశాల పైన స్పష్టత లేకపోవటంతో.. తనకు జూబ్లీహిల్స్ సీటు కేటాయించాలని ఢిల్లీ కేంద్రంగా అజాహరుద్దీన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి నలుగురు నేతల పేర్లను ఇన్‌చార్జి మంత్రులు ప్రతిపాదించారు. స్థానిక నేతలు నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్‌ల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం.
గెలిచే అవకాశం ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాల్సిందిగా ఉప ఎన్నికకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సూచించారు. ఈ మేరకు నాలుగు పేర్లను ప్రతిపాదిస్తూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు వారు నివేదిక ఇచ్చారు.
ఈ నాలుగు పేర్ల జాబితాను టీపీసీసీ నేరుగా ఏఐసీసీకి ప్రతిపాదించనుంది. సర్వే నివేదికలు.. స్థానిక సమీకరణాలు...ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దుల గురించి పార్టీ అధినాయకత్వానికి రిపోర్టు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. అయితే, పార్టీ అధినాయకత్వం ఇటు పీసీసీ ప్రతిపాదనలను పరిశీలిస్తూనే... అభ్యర్ది విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీఓ ఇచ్చినందున జూబ్లీహిల్స్ టికెట్‌ను కూడా అదే సామాజికవర్గానికి ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అజాహరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీ కేంద్రంగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసారు. దీంతో.. బీసీకే సీటు ఇవ్వాలని పార్టీ భావిస్తుండటంతో.. అంజన్ - నవీన్ కుమార్ యాదవ్ లో ఒకరికి ఖరారు అవుతుందని నేతలు భావిస్తున్నారు. రేపు (మంగళవారం) అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications