'కన్నా' నిర్ణయంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్న తెలుగుదేశం?
పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గాన్ని నాదెండ్ల మనోహర్ కే కేటాయిస్తుండటంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా చంద్రబాబును కలిశారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని, వారి మధ్య ఎప్పుడోనే సీట్ల పంపకానికి సంబంధించి ఒప్పందం కుదిరిందని వార్తలు వస్తున్నాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గతంలో రెండుసార్లు తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. జనసేన తరఫున గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు.

సన్నాహాలు చేసుకుంటున్న నాదెండ్ల
తాజాగా ఇరుపార్టీల మధ్య పొత్తు ఖాయమవుతున్న నేపథ్యంలో తెనాలి నుంచి పోటీచేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో గతంలో ఉన్న పరిచయస్తులందరినీ వీలున్నప్పుడల్లా వెళ్లి కలుస్తున్నారు. గత ఎన్నికల్లో తెనాలి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజాగా ఆయన కొన్ని రోజుల క్రితం ఏ సీటు ఎవరి సొంతం కాదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి మనోహర్ కు కేటాయించడం ఖాయమని స్పష్టత వచ్చింది.

చంద్రబాబును కలిసిన ఆలపాటి
ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబునాయుణ్ని కలిశారు. గుంటూరు పశ్చి మ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మద్దాలి గిరి వైసీపీలోకి వెళ్లారు. దీంతో అక్కడ ఇన్ ఛార్జిగా కోవెలమూడి నాని ఉన్నారు. నానితోపాటు మన్నవ మోహన్ కృష్ణ సీటు ఆశిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ కూడా జనసేనలో చేరి గుంటూరు పశ్చిమ నుంచి పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే సత్తెనపల్లి నుంచి పోటీచేయడానికి కన్నా ఆసక్తి చూపుతున్నారు. దీంతో గుంటూరు పశ్చిమ సీటు కోసం జనసేన నుంచి ఒత్తిడి లేదు.

పచ్చజెండా ఊపిన బాబు
ఆలపాటి రాజా చంద్రబాబును కలిసి తన మనసులో మాట చెప్పగా అందుకు బాబు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదే సమయం ఉండటంతో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులందరితో రాజా సమావేశమవుతున్నారు. నియోజకవర్గం తెనాలి అయినప్పటికీ ఆలపాటి నివాసం మాత్రం గుంటూరే కావడంతో స్థానికత అనేది ఇబ్బంది కాదంటున్నారు. వ్యూహాత్మకంగా పావులు కదిపి గుంటూరు పశ్చిమను రాజా దక్కించుకున్నారని తెలుగుదేశం పార్టీలో వ్యాఖ్యలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications