ఎన్నికల ప్రచారం ముగిసింది- కుప్పంలోనే అసలైన పోటీ : చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి..!!
ఏపీలో పెండింగ్ లో ఉన్న 12 నగర పంచాయితీల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా ఈ 12 మున్సిపాల్టీలకు ఈ సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఆదివారం పంచాయితీ లు.. అదే విధంగా 16న జెడ్పీటీసీ- ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. 17న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇప్పుడు నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా కుప్పం మున్సిపాల్టీ పైనే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.

కుప్పం మునిసిపాలిటీ ( చిత్తూరు),
బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు), ఆకివీడు(పశ్చిమగోదావరి), జగ్గయ్యపేట (కృష్ణా), కొండపల్లి(కృష్ణా), దాచేపల్లి ( గుంటూరు), గురజాల(గుంటూరు), దర్శి(ప్రకాశం),బేతంచెర్ల(కర్నూలు), కమలాపురం (కడప), రాజంపేట(కడప ), పెనుకొండ(అనంతపురం) మున్సిపాల్టీల్లో ఎన్నికలకు రంగం సిద్దమైంది. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక జరుగనుంది. ఇక, ఈనెల 16న మిగిలిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నెల 18న ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో భాగంగా 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 13 జిల్లాల్లో మిగిలిపోయిన 16 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 54 డివిజన్లలో పోలింగ్
నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్లలో 8 ఏకగ్రీవం కాగా మిగతా 46 చోట్ల వైసీపీ, టీడీపీతో పాటూ జనసేన, కొన్ని చోట్ల వామపక్షాల అభ్యర్థులు కూడా బరిలో నిలిచాయి.ఇక అసలు ఘట్టం ఇప్పటి నుంచే మొదలు కానుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నంచేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ ముక్కుపుడకలు పంచిందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లాలోని కుప్పంలోనూ లోకేష్ పర్యటనలోనగదు పంచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కుప్పం పైనే రాజకీయ ఉత్కంఠ
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో ఎన్నిక వైసీపీ..టీడీపీ కి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వైసీపీ జెండా ఎగరేయటానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గెలుపు కోసం వైసీపీ, టీడీపీ గట్టి వ్యూహాలే రచిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని వరస పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి లేఖలు రాస్తున్నారు చంద్రబాబు. అధికారపార్టీ అదేస్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తోంది. చంద్రబాబు స్వయంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అదే పనిలో ఉన్నారు.

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి
టీడీపీ సీనియర్ నాయకులంతా కుప్పంలోనే మోహరించారు. ఇక్కడ వార్ చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లుగా మారిపోయింది. అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెర పడింది. జిల్లాలో కీలకమైన పెనుకొండతో పాటు అనంతపురంలోని 17వ డివిజన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కుప్పం తర్వాత పెనుగొండ పైనే అందరి ఫోకస్ ఉంది. రేపు (ఆదివారం) పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజుల సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. 1.మొత్లం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలి పోయిన 498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్‌లకు ఎన్నిక జరుగుతుండగా, మిగిలిపోయిన 533 వార్డు మెంబర్లకు ఎన్నిక జరగనుంది. రేపు సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications