అశోక్ ఆల్ పార్టీ: సిపిఎం, లోక్‌సత్తా విడిగానే సమైక్యం
హైదరాబాద్: ఎపి ఎన్జీవోల అధ్యక్షుడు పి. అశోక్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణ రూపకల్పన కోసం శనివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మినహా మిగతా పార్టీల నేతలంతా హాజరయ్యారు. అయితే, తాము విడిగానే సమైక్యం కోసం పోరాటం చేస్తామని సిపిఎం, లోకసత్తా తేల్చి చెప్పాయి. రాజకీయ జెఎసి ఏర్పాటుకు పార్టీలు విముఖత ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రాజకీయ జెఎసి ఏర్పాటు కావడం లేదని అఖిల పక్ష సమావేశానంతరం అశోక్ బాబు చెప్పారు. జిల్లా స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము రాష్ట్రపతిని కలువాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యతకు అన్ని పార్టీల మద్దతు ఉందని, అన్ని పార్టీలు తమ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తాయని ఆయన అన్నారు. సమైక్య ఉద్యమం కోసం ఉద్యోగులతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు సీమాంధ్ర శానససభ్యులంతా అఫిడవిట్లు సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రకు చెందిన 158 మంది శాసనసభ్యుల అఫిడవిట్లు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రపతిని కలిసే విషయంపై మరోసారి అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

పార్టీలో చర్చిస్తాం..
అఫిడవిట్లు సమర్పించే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర శాసనసభ్యులంతా పార్టీలకు అతీతంగా కలిసి రావాలని ఆయన కోరారు. బిల్లును వ్యతిరేకించడానికి పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు కలిసి రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్టమైన పరిస్థితిలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి నాలుగు పార్టీలు హాజరయ్యాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, సిఎం రమేష్, శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, కెఇ ప్రభాకర్ హాజరయ్యారు. కాంగ్రెసు నుంచి మంత్రి శైలజానాథ్, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, శాసనసభ్యుడు ఉగ్ర నరసింహా రెడ్డి హాజరయ్యారు.
సిపిఎం నుంచి కార్యదర్శివర్గ సభ్యులు వీరయ్య, ఎం వెంకటేశ్వర రావు, లోకసత్తా నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కటారి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి రవి మారుత్ హాజరయ్యారు. సమావేశం నిర్వహించిన ఎపి ఎన్జీవో హోం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ఆబిడ్స్ నుంచి ఎపిఎన్జీవో హోంకు వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణవాదులు దాడి చేయవచ్చుననే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications