అమరావతికి సీఎం జగన్, అనుకున్న విధంగానే - ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానం..!!
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 24న అమరావతి రానున్నారు. అక్కడ గృహ నిర్మాణాలకు సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు. కృష్ణాయపాలెం లే అవుట్‌లో పైలాన్ ఆవిష్కరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. వలంటీర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి ఈ కార్యక్రమానికి రావాలని సాదరంగా కోరుతున్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు : అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద వీటిని మంజూరు చేసింది. కృష్ణాయపాలెం లేఅవుట్‌లో మోడల్ హౌస్‌గా నిర్మించారు.

షీర్ వాల్ పద్ధతిలో మూడు రోజుల స్వల్ప వ్యవధిలోనే అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసింది. వీలైనన్ని ఇళ్లను షీర్ వాల్ పద్ధతిలో నిర్మించి వేగంగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు సులభంగా అర్థం అయ్యేలా మోడల్ హౌస్‌ను నిర్మించారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తూ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది.
సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి : ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు ప్రభుత్వం సీఆర్డీఏలో 1,366.48 ఎకరాల్లో 25 లేఅవుట్లలో ఇంటి స్థలాలను పంపిణీ చేసింది. 47,017 మంది లబ్ధిదారుల (ఎన్టీఆర్ జిల్లా 23,821, గుంటూరు జిల్లా 23,196) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు లభించాయి. వీరిలో 45,100 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్-3ని ఎంపిక చేసుకున్నారు.
24,200 ఇళ్లను షీర్‌వాల్ పద్ధతిలో, మిగిలినవి సాధారణ పద్ధతిలో నిర్మించేందుకు 36 లేబర్ ఏజెన్సీలను గుర్తించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా రూ.365.91 కోట్లతో విద్యుత్, నీటి సదుపాయంతో పాటు అప్రోచ్ రోడ్లను వేస్తున్నారు. ఈ లేఅవుట్లలో రూ. 72.06 కోట్లతో మౌలిక వసతులతో పాటు స్కూళ్లు, హెల్త్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు లాంటి సదుపాయాలను కల్పించనున్నారు.

సీఎం జగన్ భూమిపూజ : రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల కోసం 30 లక్షలకు పైగా గృహ నిర్మాణం లక్ష్యంగా చర్యలు చేపట్టారు. 30.65 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. రెండు దశల్లో 21.25 లక్షల (టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు, సాధారణ ఇళ్లు 18.63 లక్షలు) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకూ అనుమతులు ఇచ్చారు. సీఆర్‌డీఏలో నిర్మించే ఇళ్లు వీటికి అదనం.
సాధారణ ఇళ్లలో ఇప్పటికే 4.40 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అమరావతిలో ఇంటి పట్టాల పంపిణీ ప్రారంభించిన సీఎం..ఇప్పుడు 24వ తేదీన గృహ నిర్మాణాలకు సీఎం జగన్ భూమిపూజకు నిర్ణయించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications