ముద్రగడ Vs పవన్, వైసీపీలోకి ఎంట్రీపై క్లారిటీ - ఏ హామీ దక్కింది..!!
కొత్త సంవత్సరం వేళ గోదావరి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ రోజున తన రాజకీయ నిర్ణయం పైన అనుచరులకు స్పష్టత ఇవ్వనున్నారు. ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ముద్రగడకు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యత..పదవి పైనా స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది.
ముద్రగడ కీలక భేటీ: కాపు ఉద్యమ నేత ముద్రగడ కీలక ప్రకటనకు సిద్దమవుతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున గోదావరి జిల్లాల్లో పలువురు నేతలు తమ అనుచరు వర్గాలతో విందు సమావేశాలు ఏర్పాటు చేసారు. నాలుగేళ్ల తరువాత ముద్రగడ మరోసారి తన అనుచర వర్గంతో భేటీ అయ్యారు. ముద్రగడ వైసీపీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.

ఈ రోజున సమావేశంలో ముద్రగడ తన నిర్ణయం ఏంటో అనుచరులకు వెల్లడించే అవకాశం ఉంది. ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని సమాచారం. ఇదే విషయం పైన ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబు స్పందించారు. ముద్రగడ రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారని..ఏ పార్టీలో చేరుతారనేది అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు.
వైసీపీలోకి ఎంట్రీ: వచ్చే ఎన్నికల్లో పోటీ పైనా ముద్రగడ కుమారుడు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెబుతూనే..ముద్రగడ కూడా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. దీని పైన ముద్రగడ స్వయంగా ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు. గతంలో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తాను పోటీకి దిగుతానని ముద్రగడ ప్రకటించారు.
ఇప్పుడు పవన్ ఎక్కడ నుంచి పొటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో పిఠాపురం సీటు ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీతకు ఖరారు చేసారు. ముద్రగడ కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం సీటు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అదే విధంగా ముద్రగడ పపోటీ పైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది.
పవన్ వర్సస్ ముద్రగడ: ముద్రగడ వైసీపీలో చేరితే ఆయనకు ఇచ్చే ప్రాధాన్యత పైన పార్టీ నుంచి హామీ దక్కినట్లు తెలుస్తోంది. ముద్రగడ సిద్దమైతే కాకినాడ లోక్ సభ సీటు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తే..త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ముద్రగడను పెద్దల సభకు పంపేలా హామీ దక్కిందని పార్టీ వర్గాల సమాచారం.
అయితే, గోదావరి జిల్లాల్లో కాపు వర్గం జనసేన కు మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. పవన్ సైతం గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు కోరుకుంటున్నారు. ఈ సమయంలో ముద్రగడ వైసీపీలో ఎంట్రీ ద్వారా కాపు సామాజిక వర్గం మద్దతు ఏ పార్టీకి ఉంటుందనే ఆసక్తి కర చర్చ మొదలైంది. ఇక..పవన్ వర్సస్ ముద్రగడ రాజకీయం ఎలా ఉంటుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications