చంద్రబాబు ఎన్నికల సమరశంఖం - కీలక ప్రకటన, టార్గెట్ ఫిక్స్..!!
టీడీడీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. గోదావరి తీరాన 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తొలి అడుగు వేస్తున్నారు. టీడీపీ పసుపు పండుగ మహానాడు నేటి నుంచి రెండు రోజుల పాటు రాజమహేంద్రవరంలో జరగనుంది.
ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ సారి మహానాడు అట్టహాసరంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. చంద్రబాబు ప్రసంగంతో ప్రారంభం కానున్న ఈ మహానాడు పలు కీలక నిర్ణయాల ప్రకటనకు రంగం సిద్దమైంది.

పుసుపు పండుగ: టీడీపీ మహానాడు ఈ రోజు, రేపు జరగనుంది. రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ జరుగుతాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం కావడం ఈసారి మరో ప్రత్యేకత. ఆదివారం వేమగిరి వద్ద సుమారు 55 ఎకరాల విశాలమైన స్థలంలో బహిరంగ సభ జరుగనుంది. తొలి రోజు కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి మొదట చంద్రబాబు పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
ప్రతినిధుల సభ రిజిస్టర్‌లో తొలి సంతకం చేస్తారు.పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. చంద్రబాబు ప్రారంభోపన్యాసంతో మొదలవుతుంది. ఈ ప్రసంగంలో రానున్న ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ మహానాడు ద్వారా ఎన్నికల్లో పొత్తులు...పార్టీ నిర్ణయాలపై చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారు.
తీర్మానాలకు ఆమోదం: మహానాడులో ఈ సారి 21 తీర్మానాలను చర్చకు ప్రతిపాదించనున్నారు. వీటిలో 14 ఆంధ్రప్రదేశ్‌కు, ఆరు తెలంగాణకు సంబంధించినవి. ఆంధ్ర తీర్మానాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి సంక్షోభం, విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, పథకాల పేరిట ప్రచారార్భాటం వంటివాటిపై మహానాడు ప్రధానంగా దాడి చేయనుంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు, పేదరికం నిర్మూలనకు తీసుకున్న చర్యలు, ఆ సమయంలో రాష్ట్రాభివృద్ధిని కూడా నేతలు వివరించేందుకు సిద్దమయ్యారు. పొత్తులకు తమ పార్టీ సుముఖంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో మహానాడు వేదికగా టీడీపీ కూడా అటువంటి సంకేతాన్నే ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ తీర్మానంలో తన వైఖరిని ప్రకటించనుంది.

చంద్రబాబు కీలక ప్రసంగాలు: ఈ రోజు, రేపు పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగాల్లో కీలక అంశాల ప్రస్తావన ఉండనుంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ..తమ కార్యాచరణ పైన పార్టీ శ్రేణులకు చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో పొత్తుల కోసం పార్టీ వెంపర్లాడుతుందనే అభిప్రాయం కలగకుండా.. పొత్తులు ఎందుకనే అంశాన్ని వివరించి చెప్పనున్నారు.
వైసీపీ సంక్షేమ పథకాలే తిరిగి తమను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్న సమయంలో పార్టీ మేనిఫెస్టో పైన అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ 41 ఏళ్ల చరిత్రలో ఇది 32వ మహానాడు. అతిధుల కోసం ప్రత్యేక వంటకాలు సిద్దమయ్యాయి. రాజమహేంద్రవరం పసుపుమయంగా మారిపోయింది. ఎన్నికల వేళ జరుగుతున్న మహానాడు కావటంతో రాజకీయంగా ప్రాధాన్యత పెరిగింది.












Click it and Unblock the Notifications