అమరావతి పాదయాత్రపై దాడులు-హైకోర్టులో రైతుల పిటిషన్-రాజమండ్రి ఎంపీ భరత్ పైనా..
అమరావతి రాజధాని కోరుతూ రైతులు సాగిస్తున్న పాదయాత్రపై వైసీపీ దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభమైన ఈ దాడులు తూర్పుగోదావరి జిల్లాలోనూ కొనసాగుతున్నాయి. రాజమండ్రిలో తాజాగా పాదయాత్ర చేస్తున్న రైతులపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తో పాటు ఆయన అనుచరులు బాటిళ్లు, రాళ్లు విసిరారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ అధికార పార్టీ వైసీపీ తమకున్న అధికార బలంతో అడ్డంకులు కల్పిస్తోందని, దాడులు చేయిస్తోందని, పోటీగా వికేంద్రీకరణ సభలు పెట్టిస్తోందని పిటిషర్ అయిన అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. అమరావతి పరిరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నవ మురళీధర్ రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు వస్తుందని భావిస్తున్నారు.

అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు ఆదేశాల ప్రకారం బందోబస్తు కల్పించాల్సిన ప్రభుత్వం.. పోటీగా సభలకు అనుమతిస్తూ కావాలనే రైతుల్ని రెచ్చగొడుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాజమండ్రిలో అమరావతి పాదయాత్ర రూటులోనే ఆజాద్ చౌక్ లో వికేంద్రీకరణ సభ పెట్టడమే కాకుండా, అటుగా వెళ్తున్న రైతులపై దగ్గరుండి దాడులు చేయించిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. ఇందుకు ఆధారంగా మొన్న ఎంపీ భరత్ దాడుల దృశ్యాల్ని జత చేసారు. అలాగే పలు చోట్ల పాదయాత్రకు నిరసనగా వైసీపీ నేతలు నల్లబెలూన్లు ఎగరేస్తున్న దృశ్యాల్ని కూడా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు జత చేశారు.












Click it and Unblock the Notifications