ఆంక్షలు, ఇబ్బందుల మధ్య సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర .. 15 వ రోజు పాదయాత్రలో అపశృతి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలన్న డిమాండ్ తో రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుంది. న్యాయస్థానం టు దేవస్థానం అన్న పేరుతో 15 వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతు మహా పాదయాత్ర అనేక ఆంక్షలు, అడుగడుగునా ఇబ్బందుల మధ్య ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. రాజధాని రైతులు, మహిళలు గత 15 రోజులుగా ప్రజల మద్దతు కూడగడుతూ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి ఆకాంక్షను వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.
తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నా, రాత్రి సమయాల్లో బస చేసే విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నా, పోలీసుల ఆంక్షలతో పాదయాత్రకు ఇబ్బందులు కలుగుతున్నా, అడుగడుగునా పోలీసుల నిఘా మధ్య అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న రైతులు పోలీసుల నోటీసులకు, ప్రభుత్వ బెదిరింపులకు వెరవక ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న ఎన్నికలు కూడా పాదయాత్రకు ఇబ్బండ్లులు కలిగిస్తున్నాయి.అయినా సరే అమరావతి రైతులు ముందుకు సాగుతున్నారు.

తొమ్మిది రోజులుగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర .. నవంబర్ 15 న ఇలా
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీఆర్డీఏ రద్దు ను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ప్రకాశం జిల్లాలో తొమ్మిదవ రోజు కొనసాగుతోంది. మొదటి ఆరు రోజులు గుంటూరు జిల్లాలో కొనసాగిన పాదయాత్ర, గత తొమ్మిది రోజులుగా ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.సోమవారం నాడు పాదయాత్ర జరుగుమల్లి మండలంలో ప్రారంభమైంది. సోమవారం నాడు పాదయాత్ర 14 కిలోమీటర్ల మేర సాగి కందుకూరు మండలం విక్కిరాలపేట లో ముగియనుంది. అమరావతి రైతులు సాగిస్తున్న మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజల నుండి సంఘీభావం లభిస్తోంది. పాదయాత్రకు సంఘీభావం తెలపడమే కాకుండా అనేకమంది అమరావతి రైతుల పోరాటానికి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
పాదయాత్రలో అపశృతి; బెలూన్ల గ్యాస్ సిలెండర్ పేలి ముగ్గురికి గాయాలు
ఇదిలా ఉంటే అమరావతి రైతుల పాదయాత్రలో 15 వ రోజు అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో అమరావతి రైతులు పాదయాత్రగా వెళుతున్న క్రమంలో బెలూన్ల గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జరుగుమల్లి మండలంలో చిరికూరపాడు గ్రామంలో రైతుల పాదయాత్ర జరుగుతున్న సమయంలో బెలూన్లో గ్యాస్ నింపుతూ ఉండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడి వారందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పాదయాత్ర లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఆందోళన చెందారు. అయితే బెలూన్లకు నింపే గ్యాస్ సిలిండర్ పేలిందని తర్వాత గుర్తించారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన మేడా నవీన్, సకల బత్తుల భాస్కరరావు, విన్నకోట భాస్కర్ రావు లు గాయపడినట్లు గా గుర్తించారు. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనేక పోలీస్ ఆంక్షలు, వీడియో నిఘా మధ్య రాజధాని కోసం రైతుల మహా పాదయాత్ర
ఇక అనేక పోలీసుల అంక్షల మధ్య అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. రైతులు చేస్తున్న పాదయాత్రకు ఇతర పార్టీల నాయకులు సంఘీభావం తెలపడానికి వీల్లేదని, రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రలో పాల్గొనకూడదని, లౌడ్ స్పీకర్లు, మైకులు పెట్టకూడదని, పాదయాత్రకు అనుమతి కోరిన రైతులు మాత్రమే పాదయాత్రను కొనసాగించాలని ఇలా అనేక నిబంధనలు పెట్టిన ఏపీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేస్తున్నారు. రైతుల పాదయాత్ర ఆద్యంతం వీడియో చిత్రీకరణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications