ఆర్ధిక కష్టాల్లో అమరావతి: అయోమయంలో సీఆర్‌డీఏ
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని. గత నెల దసరా రోజున అత్యంత అట్టహాసంగా అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఇక పనులు మెదలు పెట్టడమే తరువాయి. కానీ రాజధాని నిర్మాణానికి నిధులు లేక అమరావతి ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటోంది.
నిధుల లేమితో తదుపరి నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి సారించలేని పరిస్థితిలో ఉంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాలనే సంకల్పంతో ఉన్న ఏపీ ప్రభుత్వం అమరావతి పూర్తి కావడానికి దీర్ఘకాలంలో రూ. 5 లక్షల కోట్లు ఖర్చవుతాయన్నది రాష్ట్ర ప్రభుత్వ అంచనా.
తక్షణం ప్రాధమికంగా పనులు మొదలు పెట్టాలంటే ఎంతలేదన్నా రూ. 5 వేల కోట్లు కావాలి. ఇంత డబ్బు ఏపీ సర్కారు ఖజానాలో లేకపోవడం పెద్ద సమస్య అయి కూర్చుంది. రాజధాని నగర నిర్మాణ బాధ్యతంతా తమదేనని చెప్పుకున్న కేంద్రం ఇప్పటివరకూ ఇచ్చింది రూ. 1,500 కోట్లు మాత్రమే.

రాజధాని నిర్మాణానికి ఇంకా నిధులు ఇవ్వాలంటే, గతంలో ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టారనేది లెక్కలు చూపించాలి. ఇప్పుడా లెక్కలు సీఎం చంద్రబాబు వద్ద లేవు. దీంతో రాజధాని పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు లేకపోవడంతో సీఆర్‌డీఏ అధికారులు అయోమయంలో ఉన్నారు.
ఏపీ ప్రభుత్వానికి వివిధ రకాల ఖాతాల కింద కేంద్రం నుంచి ఇంకా రూ. 20 వేల కోట్లు రావాల్సివుందని, ఆ నిధులు వస్తే సమస్య సద్దుమణుగుతుందని ప్రభుత్వం భావించినా, ఆ నిధులు వస్తే రెవెన్యూ లోటు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు గతంలో ప్రకటించిన ప్యాకేజీ, పరిశ్రమల అభివృద్ధి నిధులు తదితరాలన్నింటికీ వెచ్చించాల్సి ఉంది.
మరోవైపు, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వనరుల నుంచి కూడా తగినన్ని నిధులు రానందున బడ్జెట్‌లో అదనపు నిధులు కోరవద్దని మంగళవారం ఆర్థిక మంత్రి యనమల సచివాలయంలో ఆర్థికశాఖ అధికారులతో సమీక్షించినప్పుడు పలు శాఖలకు స్పష్టం చేశారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో ఇప్పటి వరకూ రూ.7 వేల కోట్ల ఆదాయ లోటు ఉందన్నారు. మరోవైపు, బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇప్పటికే రూ.10 వేల కోట్లు అదనంగా ఖర్చు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నందున రాజధాని అమరావతి ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటోంది.












Click it and Unblock the Notifications