BITS Pilani Campus:అమరావతిలో బిట్స్ క్యాంపస్..! అడ్మిషన్లు అప్పుడే..!
ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) కొత్త క్యాంపస్ ఏర్పాటుపై కీలక అడుగు పడింది. బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణానికి వీలుగా ఇవాళ సీఆర్డీఏయే కీలక ఒప్పందం కుదిరింది. దీంతో త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్ద పనులు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే అడ్మిషన్ల ప్రక్రియ, ఇతర వివరాలపై ఏపీ సీఆర్డీఏ ఇవాళ ఓ ప్రకటన చేసింది.
అమరావతిలో బిట్స్ క్యాంపస్ (BITS pilani)
అమరావతిని ఉన్నత విద్యా కేంద్రంగా మార్చే క్రమంలో ప్రముఖ యూనివర్సిటీ అయిన బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS pilani) అమరావతిలో 70.011 ఎకరాలలో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుందని సీఆర్డీఏ తెలిపింది. తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెంలో ఈ మేరకు బిట్స్ సంస్దకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ మేరకు సీఆర్డీయేతో ఇవాళ బిట్స్ సంస్థ ప్రతినిధులు భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

మూడు దశల్లో నిర్మాణం
బిట్స్ అమరావతి క్యాంపస్‌ను మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొదటి దశలోనే సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో క్యాంపస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆధునిక మౌలిక వసతులతో కూడిన స్మార్ట్ భవనాలు, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, ఆధునిక బోధన పద్ధతులు, పర్యావరణహిత నిర్మాణాలతో ఈ క్యాంపస్‌ను కొత్త తరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

2027 నుంచే అడ్మిషన్లు
2027 నుంచి అమరావతి క్యాంపస్‌లో విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. దశలవారీగా పదివేల మంది విద్యార్థులు అమరావతి బిట్స్ క్యాంపస్‌లో విద్యను అభ్యసించేలా ప్రణాళికాయుతంగా కార్యకలాపాలు నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమరావతిలో బిట్స్ క్యాంపస్ రాకతో వందలాది అధ్యాపకులు, సిబ్బంది, సాంకేతిక & అనుబంధ రంగాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభించి, రాజధానిలో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి అవకాశాలు విరివిగా పెరగనున్నాయి.












Click it and Unblock the Notifications