టీటీడీ ఛైర్మన్ కే షాక్ ఇచ్చిన అమరావతి శ్రీవారి ఆలయ సిబ్బంది..!!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 84,017 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,097 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.97 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఓ సాధారణ భక్తుడిలా ఆయన ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట టీటీడీ అధికారులు గానీ, ఇతర సిబ్బంది గానీ ఎవరూ లేరు. క్యూలో ఉండి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వహణలో కొన్ని నిర్లక్ష్యాలను గమనించానని బీఆర్ నాయుడు వెల్లడించారు. భక్తుల పట్ల ఆలయ ఉద్యోగులు, అక్కడి సిబ్బంది ప్రవర్తించిన తీరులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని అన్నారు. చివరికి- శ్రీవేంకటేశ్వర స్వామివారి అలంకరణలో కూడా ఈ నిర్లక్ష్యం నెలకొని ఉందని ఆయన చెప్పారు. ఇది బాధాకరమని వ్యాఖ్యానించారు.
ఇటువంటి నిర్లక్ష్యపూరక వైఖరిని టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని బీఆర్ నాయుడు తేల్చి చెప్పారు. భక్తులకు సేవలను అందించడంలో రాజీ పడబోమని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అమరావతి శ్రీవారి ఆలయంలో నెలకొన్న ఈ నిర్లక్ష్య వైఖరిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ఇకపై దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాలను ఆకస్మికంగా సందర్శించాలని నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. భక్తులకు అందించే సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications