కొడుకు డబ్బులిస్తే.. తండ్రి కండువా కప్పేస్తున్నారు: లోకేష్, బాబులపై అంబటి ఫైర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు దుష్టపాలన సాగుతోందని విమర్శించారు.
శుక్రవారం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన వారిని కాపాడుకోవడానికి శాసనసభను వేదికగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.
పార్టీ మారిన వారికి కొడుకు డబ్బులిస్తే, తండ్రి కండువా కప్పుతున్నారని ఆరోపించారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామన్న భ్రమలో ఉన్నారని అన్నారు. వాగ్ధానాల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని అంబటి రాంబాబు విమర్శించారు.

మీడియా సహా అన్ని వ్యవస్థలను చంద్రబాబు, లోకేశ్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖర్చు గురించి టీడీపీ నేతలు ఎవ్వరూ ఆలోచించవద్దని, తానే ఖర్చుచేసి తానే గెలిపిస్తానని చంద్రబాబు చెప్పడంపై అంబటి మండిపడ్డారు.
ఎన్నికలు ఖర్చు పది కోట్లైనా, ఇరవై కోట్లైనా చంద్రబాబు ఖర్చు పెడతారంటున్నారు.. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు.
చంద్రబాబును మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కూడా అనుమానిస్తోందని వెల్లడించారు.
చంద్రబాబును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పోల్చడం భావ్యం కాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో రూ. 50 లక్షలిచ్చి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని గుర్తు చేశారు. సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు అసెంబ్లీలో డివిజన్ ఓటింగ్‌కు ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు.
అసెంబ్లీలో అధికార సభ్యులు దూషణలకు దిగినప్పటికీ జగన్ మాత్రం సంయమనంతో ప్రజా సమస్యలను ప్రస్తావించారని అంబటి రాంబాబు చెప్పారు. 340 నిబంధన కింద ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications