అమెరికా నుంచి 'సత్యం' దాకా: లోకేష్ 'ఫోటోలు' విడుదల చేసిన అంబటి
విజయవాడ: విలువల వ్యవస్థ, మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన గొప్ప లక్షణాల గురించి అనర్గళంగా లెక్చర్లు దంచడం ఆపాలని, మీ ప్రవర్తన తాలుకూ మచ్చుకు కొన్ని ఫోటోలు విడుదల చేస్తున్నామని, వాటికి సమాధానం చెప్పాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను వైసిపి డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా అంబటి.. నారా లోకేష్ మంత్రితో, కొందరు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటోలు చూపించారు. లోకేష్ అమెరికా లేఖాయణంకు కౌంటర్ అంటూ సాక్షి మీడియాలోను ఫోటోలు ఇచ్చారు.
మీరు వీటికి సమాధానం ఇస్తే మీ విలువలు, సంస్కారం గురించి ప్రజలు అర్థం చేసుకుంటారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సాక్షి ఓ వార్త ప్రచురిస్తే దానికి మా అధినేత జగన్‌ను నిందించడం సరికాదన్నారు.
జగన్‌కు సభ్యత, సంస్కారం లేవని లేఖ రాయడం ఎంత వరకు సమంజసం అన్నారు. లక్షల కోట్ల నల్లధనాన్ని మీరు వెనుకేసుకొని దానిని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టిని మరల్చేందుకు మా పై నిందలు వేస్తారా అని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు కౌంటర్ ఇచ్చారు.

కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నాయని, వాటి కనుసన్నుల్లో పని చేసే విచారణ సంస్థలు ఉన్నాయన్నారు. దమ్ముంటే నల్లధనం పైన విచారణ జరిపించి నిజానిజాలు బయట పెట్టాలని సవాల్ చేశారు. సత్యం రామలింగ రాజు మీకు స్టాన్‍ఫోర్డ్ సీటు కొనిచ్చారని లోకేష్ పైన ఆరోపించారు.
లేదంటే ఇంటర్లో అత్తెసరు మార్కులతో గట్టెక్కిన మీకు యూనివర్సిటీలో సీటు వస్తుందా అని ప్రశ్నించారు. ఆ మార్గంలో సీటు కొనుక్కునే నేర్పు మాకు లేదన్నారు. అలాంటి విలువలు మాకు లేవని ఎద్దేవా చేశారు. పార్టీ పదవిని అడ్డు పెట్టుకొని మంత్రులపై పెద్దనం చేసే సంస్కారం మాకు లేదన్నారు.
మంత్రుల పేషీల్లో మీడియా లైజనింగ్ ఆఫీసర్లను నియమించి ప్రతి పనికి కమీషన్లు వసూలు చేసే తెలివితేటలు మాకు లేవన్నారు. మీ అంతటి గొప్ప లక్షణాలు మాకు లేవని ధ్వజమెత్తారు. మంత్రి దేవినేని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
అవినీతి, చంద్రబాబు కవలలు అన్నారు. ఇసుక నుంచి ఇరిగేషన్ దాకా, బొగ్గు నుంచి సోలార్ టెండర్ల దాకా అన్ని వ్యవస్థల్లోను అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనత మీదన్నారు. రెండేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు మింగిన ఘనులు మీరన్నారు. నల్లధనం మీరు వెనుకేసి మాపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
వెల్లడించిన నల్లధనం మీదేనన్న విషయం బయటపడుతుందని, ఆ భయంతో మా నాయకుడి పైన మీ మీడియాలో వార్తలు రాయిస్తున్నారన్నారు. ఇవాళ మీరు నల్లధనం జగన్‌దేనని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే దోషులు ఎవరో తెలుస్తోందన్నారు. వీటిపై విచారణ జరిపించాలన్నారు.












Click it and Unblock the Notifications