టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్: 'చంద్రబాబుకు విశ్వాసం లేదా?'
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తెరలేపిన 'ఆపరేషన్ ఆకర్ష్' పై వైసీపీ నేతలు తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. శనివారం ఆపార్టీకి చెందిన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనైతిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాజకీయాల్లో ఏ తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సంతల్లో పశువులను కొంటున్నట్లుగా చంద్రబాబు నాయుడు 20 నుంచి 50 కోట్ల రూపాయల వరకు పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెజార్టీ టీడీపీకి ఉన్నా, తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబుకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై విశ్వాసం లేదా అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. తప్పు చేసిన వాడి మొహం చంద్రబాబుదైతే.. తప్పు చేయనివాడి మొహం వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతిని త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు.
డబ్బు, పదవులను ఎరచూపి తమ వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే వారిపై అనర్హత వేటుపడటం ఖాయమన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications