అంబటి రాంబాబుకు బెయిల్, విడుదల ఎప్పుడంటే..!!
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. రూ పది వేలు, రెండు పూచీ కత్తు పై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో, అంబటి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిలీఫ్ దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యకర పదజాలంతో దూషించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న అంబటి రాంబాబుకు కోర్టు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాంబాబును నల్లపాడు పోలీసులు ఇటీవల అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బెయిల్ కోసం గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టులో రాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం అంబటికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం తీర్పు చెప్పారు. మరోసారి ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, కేసును ప్రభావితం చేసే విధంగా బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడరాదని రాంబాబుకు షరతు విధించారు. కేసులో చార్జిషీటు దాఖలు చేసే వరకు, లేదంటే రెండు నెలల పాటు ప్రతి రెండు శనివారాలకు ఒకసారి పోలీస్ స్టషన్‌కు హాజరై సంతకాలు చేయాలన్నారు. రూ.పదివేలతో ఇరువురు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొన్నారు.

ఈ రోజు లేదా రేపు విడుదలకు ఛాన్స్
కాగా, చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ వచ్చినా.. గతంలో పోలీసులను బెదిరించిన కేసులో అంబటికి మరో కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ గతేడాది నవంబరు 12న అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా పోలీసుల సూచనలను రాంబాబు బేఖాతరు చేసి, అడ్డంగా పెట్టిన బారికేడ్లను లాగిపడేసారు. అభ్యంతరం చెప్పిన పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లును, సిబ్బందిని బెదిరించి, వారిని నెట్టుకుంటూ బ్రిడ్జి పైకి ర్యాలీగా వెళ్లారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు పీటీ వారంట్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి గుంటూరు లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టులో హాజరు పరచగా ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. కాగా, ఇప్పుడు పోలీసు కస్టడీ తిరస్కరించిన కోర్టు.. రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఎటువంటి ఆటంకాలు లేకుంటే ఆయన ఈ సాయంత్రం లేదా రేపు (గురువారం) జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా.. కోర్టు బెయిల్ మంజూరు చేయటం పైన అంబటి రాంబాబు ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేసారు. అందులో దౌర్జన్యాలు,దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు .. అంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications