చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్నా
Ambati Rambabu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు ఏమీ చేయకపోయినా తన అనుకూల మీడియా ద్వారా హీరోలా చూపించుకుంటున్నారని, వాస్తవానికి ఆయన ఓ విలన్ అని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్నా విలన్ లాగే వ్యవహరిస్తారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.

శనివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామని, పీడీ యాక్ట్ పెట్టి తాటతీస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన విషయాలను గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబే అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తోన్నారని అంబటి రాంబాబు విమర్శించారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను చంద్రబాబు టార్గెట్ చేస్తోన్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు, వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. చేబ్రోలు కిరణ్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడని, అతణ్ని పోలీసులు అరెస్ట్ చేసి, వదిలేశారని అంబటి అన్నారు. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదని, వైసీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారని చెప్పారు.
చేబ్రోలు కిరణ్‌ను మాత్రం పోలీస్ కస్టడీకి ఎందుకు తీసుకోలేదని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు పెంచి పోషించడం వల్లే చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయిందని విమర్శించారు. చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తి కాలేదని పేర్కొన్నారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో కొన్ని వందల మంది ఐటీడీపీలో పని చేస్తోన్నారని, ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారని అంబటి ఆరోపించారు. తాము టీడీపీని ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడని, తమ పార్టీ కండువా వేసుకుని టీడీపీ తరపున తిడతాడని అన్నారు.
వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య అని అంబటి చెప్పారు. ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పైశాచికానందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబేనని, ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారని అన్నారు.












Click it and Unblock the Notifications