ప్రతిపక్ష పార్టీలకు ఏడుపు నామ సంవత్సరం 2021; వారి కడుపుమంట అందుకే: అంబటి రాంబాబు
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2021 సంవత్సరం ప్రతిపక్ష పార్టీలకు ఏ విధంగా ఉందో అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు.

ప్రతిపక్ష పార్టీలకు ఏడుపు నామ సంవత్సరం
బిజెపికి 2021 మద్యపాన సంవత్సరమని, జనసేన కు ప్యాకేజీ నామ సంవత్సరమని, టిడిపికి, చంద్రబాబుకు డ్రామా నామ సంవత్సరం అంటూ, కమ్యూనిస్టు పార్టీలకు భూస్వామ్య అనుకూల పోరాటాలు చేసి భ్రష్టు పట్టిన సంవత్సరం అంటూ, మొత్తంగా ప్రతిపక్ష పార్టీలకు ఏడుపు నామ సంవత్సరం 2021 అని పేర్కొన్నారు అంబటి రాంబాబు. వైసిపి కి మాత్రం అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరం అంటూ కితాబిచ్చారు. 2021 సంవత్సరం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అన్ని విజయాలు వరించాయని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు ఎక్కడ ఎన్నికలు పెట్టిన అద్భుతమైన విజయాలు సాధించిన మహత్తరమైన సంవత్సరం 2021 అని ఆయన పేర్కొన్నారు.

ఆర్ధిక రధ చక్రం కదలకున్నా సంక్షేమ పథకాలు ఆగలేదు
ఆర్థిక రథచక్రం కదలలేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాలు ఆగలేదని పేర్కొన్న అంబటి రాంబాబు, మేనిఫెస్టోలో ఇచ్చిన 95 హామీలను రెండున్నర సంవత్సరాల్లో నెరవేర్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు. తాను గుంటూరు వ్యక్తిగా చెబుతున్నారని అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని శాసన రాజధానిగా ఉంటుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలన్న దృక్పథం తోనే సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని దానికి కూడా ప్రతిపక్ష పార్టీలు ఏడుస్తున్నాయి అంటూ అసహనం వ్యక్తం చేశారు. అందుకే వారికిది ఏడుపు నామ సంవత్సర మని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

తాలిబన్లకు బీజేపీ నేతలకు తేడా ఏముంది
ఇక ఇదే సమయంలో బీజేపీ పై విరుచుకుపడిన అంబటి రాంబాబు భారతీయ జనతా పార్టీ నా భారతీయ జూద పార్టీనా అంటూ మండిపడ్డారు. జిన్నా టవర్ ను పేల్చివేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆప్ఘనిస్థాన్లో బుద్ధుడి విగ్రహాన్ని కూల్చేసిన తాలిబన్లకు బీజేపీ నేతలకు తేడా ఏముంది అంటూ ప్రశ్నించారు. అద్వానీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లి జెండా సమాధిని సందర్శించారని, అద్వానీ చర్యను బీజేపీ నేతలు ఖండిస్తారా అంటూ ప్రశ్నించారు. దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ, జిన్నా తమ వంతుగా కృషి చేశారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

జిన్నా టవర్ పై ఇన్నేళ్ళు బీజేపీ గుడ్డి గుర్రాల పళ్ళు తోముతుందా?
1943లో జిన్నా టవర్ ను నిర్మించారని ఇన్నేళ్లు బీజేపీ గుడి గుర్రాల పళ్ళు తోముతుందా అంటూ మండిపడ్డారు. టిడిపి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉన్న సమయంలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. చీప్ లిక్కర్ పోసి ఓట్లు సంపాదించాలనుకునే చీప్ పార్టీ బిజెపి అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. మద్యం పై ప్రభుత్వ విధానాలు మారుతుంటాయి అని, దానిలో తప్పేముంది అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. హత్యా రాజకీయాలు చేయాల్సిన ఖర్మ వైసిపికి పట్టలేదని పేర్కొన్న ఆయన, వంగవీటి రంగా ని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు.

సంక్షేమ ఫలాలు అందించిన చరిత్ర ఏ పార్టీకి లేదు .. అందుకే కడుపు మంట
గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన చరిత్ర ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్ పార్టీలలో ఏ పార్టీకి లేదని పేర్కొన్న ఆయన అందుకే వారి కడుపు మంట అంటూ వ్యాఖ్యానించారు. గత 30 నెలలో 1.16 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నవరత్నాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications