రాజారెడ్డి మీసంలోని వెంట్రుకతో సమానం కాదు ఆ ముగ్గురు.. రఘురామ ఓ తేడా మనిషి!
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము చెప్పినట్లే గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలను నిగ్గుతేలుస్తున్నామని అన్నారు.

టీడీపీ మీద కక్షసాధింపా?
అవినీతిని వెలికిస్తామని.. తప్పు చేసిన వారిని కోర్టులో నిలబెడతామన్నారు. ఇప్పుడు అరెస్టు చేసినది తొలి అడుగు మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సమానంగా దిగజారిన టీడీపీపై కక్ష సాధించాల్సిన అవసరం తమకేం ఉంటుందన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేస్తే టీడీపీకి సింపతీ వస్తుందని తమకు తెలీదా? అని అంబటి ప్రశ్నించారు.

రాజధాని పెద్ద స్కామ్.. జైలుకెళ్తారు..
పూర్తి ఆధారాలతోనే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని, దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అని అంబటి దుయ్యబట్టారు. ముందుంది మొసళ్ల పండగ అని అన్నారు. చంద్రన్న కానుక వంటి వాటిల్లో అక్రమాలు బయటకు వస్తాయన్నారు. రాజధాని భూముల వ్యవహారం అతి పెద్ద స్కామ్ అని ఆరోపించారు. ఇది బయటకు వస్తే ఇంకెంత మంది జైళ్లకు వెళ్లే పరిస్థితి వస్తుందో అని అంబటి అన్నారు.

లోకేష్ కు గుర్తింపేది?
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లోకేష్‌కు ఉందా? అని అంబటి ప్రశ్నించారు. రాజారెడ్డి మీసంలోని వెంట్రుకకు కూడా లోకేష్ సరితూగరని అంబటి విమర్శించారు. లోకేషే కాదు.. చంద్రబాబు, ఖర్జూరపు నాయుడు కూడా రాజారెడ్డికి సరిపోరని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కొడుకుగా.. బాలకృష్ణ అల్లుడిగా తప్ప లోకేష్‌కున్న అర్హతేంటీ? అని అంబటి ప్రశ్నించారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటున్న లోకేష్.. ఏం చెల్లిస్తాడు? హెరిటేజ్ కంపెనీలో అప్పు చెల్లిస్తాడా? అని అంబటి ఎద్దేవా చేశారు.

రఘురామ కృష్ణంరాజు ఓ తేడా మనిషి..
ఇక చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి రావడం కల్ల అని అంబటి అన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే ధ్యాసే చంద్రబాబుకు లేదన్నారు. ఇక జగన్ గురించి రఘురామకృష్ణ రాజు కామెంట్స్ మీద స్పందిస్తూ.. ఎప్పుడూ ఆయన అలాగే మాట్లాడతారని, ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని అంబటి అన్నారు. అంతేగాక, రఘురామకృష్ణంరాజు తేడా మనిషంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications