ఏపీలో మన లెక్క ఇదే - పార్టీ నేతలకు తేల్చి చెప్పిన షా..!!
కేంద్ర హోం మంత్రి ఏపీ బీజేపీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. ఏపీ పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా.. పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యల పైన రోడ్ మ్యాప్ నిర్దేశించారు. పార్టీలో సమన్వయంతో పని చేయాలని.. కేంద్రం నుంచి ఏపీకి అందుతున్న సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని షా స్పష్టం చేసారు. విజయవాడలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ సభ గురించి ఆరా తీసిన షా.. ఏపీలో తాజా పరిణామాల పైన చర్చించారు.
ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశంలో ఆసక్తి కర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు.. పార్టీ పరిస్థితి పైన ఆయన ఆరా తీసారు. పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారని ప్రశ్నించారు. పార్టీ సమావేశాల గురించి ఆరా తీసారు. పార్టీ లో సమన్వయం ఉండాలని సున్నితంగా హెచ్చరించారు. ప్రభుత్వంలో కొనసాగుతున్నా.. పార్టీ పరంగా కార్యక్రమాలు.. కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం నుంచి ఏపీకి పెద్ద ఎత్తున సాయం అందుతోందని.. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేసారు. పార్టీలో బూత్ స్థాయి నుంచి బలోపేతం పైన మార్గనిర్దేశం చేసారు.

ఏపీలో బీజేపీ ఎదిగేందుకు ఇప్పుడు అనుకూల సమయం ఉందని.. కేంద్రం అందిస్తున్న మద్దతు పైన ప్రజల్లో సానుకూలత ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బలోపేతానికి నేతలు అందరూ కృషి చేయాలని, అంతర్గత విభేదాలు పక్కన పెట్టి.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అమిత్ షా ఆదేశించారు. హైందవ శంఖారావం సభ విజయవంతం అవడంపై వీహెచ్‌పీ నేతలు, పార్టీ నేతలను అమిత్ షా అభినందించారు. ప్రజలను భాగస్వాములను చేసే సభలు.. సమావేశాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీలో కమిటీల నియామకం గురించి అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications