ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన అమిత్ షా...!!
ఏపీలో అధికారం దక్కేదెవరికి. కౌంటింగ్ సమయం సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసం తో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు తమదే గెలుపు అని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీలో ఎన్నికల సరళి పైన పూర్తి సమాచారం సేకరించిన బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. ఏపీలో ఫలితం పైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు.
అమిత్ షా వ్యాఖ్యలు
ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పుడుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేసారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏపీలో..కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు ఖాయమని చెప్పుకొచ్చారు. ఏపీలో మూడు పార్టీల కూటమి 17 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తన అంచనాగా వెల్లడించారు. ఏపీతో పాటుగా ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ లోనూ తమ పార్టీ ప్రభుత్వాలే ఏర్పడుతాయన్నారు. ఈ సారి అధికారంలోకి వచ్చిన తరువాత యూసీసీ, జమిలి ఎన్నికల పైన నిర్ణయాలు ఉంటాయని అమిత్ షా స్పష్టం చేసారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా తన అంచనాలను విశ్లేషించారు.

ఎన్డీఏదే అధికారం
ఏపీలో బీజేపీ 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ గతం కంటే రెండు శాతం పెరగటం తమకు కలిసొచ్చే అంశంగా టీడీపీ కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, వైసీపీ లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. రెండో సారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు చేసారు. విశాఖలో ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. విమానాలు, ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ కూటమి గెలుపు ఖాయమని చెబుతోంది.
17 ఎంపీ సీట్లు గెలుస్తాం
ఈ సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 17 ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయని చెప్పటం ద్వారా దాదాపుగా 100కి పైగా స్థానాల్లో కూటమి గెలుస్తుందనే సంకేతాలు ఇచ్చారు అయితే, టీడీపీ కూటమి నేతలు 120 సీట్ల వరకు గెలుస్తామని అంచనా వేస్తున్నారు. కానీ, జగన్ మాత్రం గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ మరింత ఆసక్తిని పెంచారు. దీంతో..జూన్ 1న వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్ పైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది. జూన్ 4న వాస్తవ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాల పైన భిన్నమైన అంచనాలు వెలువడుతున్న ఈ సమయంలో జూన్ 4న వెల్లడి కానున్న ఫలితం పైన అభ్యర్దులతో పాటుగా సామాన్యుల్లోనూ ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications