చంద్రబాబు వర్సెస్ అమిత్ షా...ఢీ అంటే ఢీ:ఏం జరుగుతుందో?
మిత్ర పక్షాల నుంచి శత్రు పక్షాలుగా మారిన టిడిపి-బిజెపి మధ్య పోరు పతాక స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. ఎపికి అన్యాయం చేసిందంటూ బిజెపితో కటీఫ్ చేసుకున్న టిడిపి గత కొన్నాళ్లుగా ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాని లక్ష్యంగా చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఎట్టకేలకు టిడిపి ఆరోపణలపై స్పందించారు. టిడిపి తమపై చేస్తున్న విమర్శలకు సమాధానాలు ఇవ్వడమే కాదు ...ఎపిలో తమ భవిష్యత్తు రాజకీయాలపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. మరోవైపు టిడిపి మహానాడులో చంద్రబాబు మరోసారి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. ఎపి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అసలు అమిత్ షా ఎవరన్నారు. ఇలా మరోసారి జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఎట్టకేలకు...స్పందించిన అమిత్ షా
భాగస్వామ్య పార్టీ నుంచి వైరి పక్షంగా మారిన టిడిపి తమ పార్టీపై చేస్తున్న ఆరోపణలు,విమర్శలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎట్టకేలకు స్పందించారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 2100 కోట్ల రూపాయలను నిధులను ఇచ్చిందని అమిత్ షా చెప్పారు. కాని చంద్రబాబు స్రభుత్వం వాటిని రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయలేదని, అసలు ఆ నిధులు ఏం చేశారో లెక్కలు చెప్పడం లేదని ఆరోపించారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకపోతే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందని అమిత్ షా ప్రశ్నించారు.

అమిత్ షా...మరి కొన్ని విమర్శలు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం తాము వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క భవనానికి కూడా ఇప్పటి వరకూ టెండర్ పిలవకపోవడం ఏమిటని అమిత్ షా తప్పుబట్టారు. చంద్రబాబు పలు సార్లు రాజధాని నిర్మాణం కోసమంటూ తయారుచేయించిన డిజైన్లన్నీ నేటికీ సింగపూర్ దగ్గరే ఉన్నాయన్న విషయం గమనించాలని అమిత్ షా అన్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు.

ఎపిలో రాజకీయ భవితవ్యంపై...స్పష్టత
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని అమిత్ షా స్పష్టంచేశారు. తాము ఏపీలో ఎవరితో పొత్తు పెట్టకోమని అమిత్ షా తేల్చేశారు. ఇటీవలే ఎపి బిజెపి నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులైన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసే విషయమై దిశానిర్దేశం చేసేందుకు అమిత్ షా సంసిద్దమవుతున్నారు. త్వరలోనే ఎపిలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు.

అమిత్ షా మండిపడ్డ చంద్రబాబు
ఎపి ప్రభుత్వంపై అమిత్ షా వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విజయవాడలో జరుగుతున్న టిడిపి మహానాడు రెండో రోజు సమావేశాల్లో అమిత్ షా పై చంద్రబాబు విమర్శలతో విరుచుకు పడటమే కాదు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎపి ప్రభుత్వం యుటిలిజైషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని అమిత్ షా చెప్పడం సరికాదన్నారు. అసలు అమిత్ షా ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడని, ఆయనకు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదన్నారు. అమరావతిలోని రాజధాని భవనాలకు తాము ఇప్పటికే టెండర్లు పిలిచామని చంద్రబాబు చెప్పారు. వివరాలు తెలియకుండా అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. అసలు ఎపి ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదన్నారు. అయినా యూసీల విషయంలో ప్రధాని అడిగితే తాను సమాధానం చెబుతానని, వాటి గురించి అడగడానికి అమిత్ షా ఎవరిని చంద్రబాబు ప్రశ్నించారు.

విభేదాలు...తారా స్థాయికి:ఏం జరుగుతుందో
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు...బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేరుగా ప్రత్యక్ష విమర్శలకు దిగడంతో ఇక ఈ రెండు పార్టీల మధ్య వైరం తారాస్థాయికి చేరినట్లే అర్థమవుతోంది. ఎపిలో పరిస్థితిపై అమిత్ షా తనదైన వైలిలో కుండబద్దలు కొట్టగా...టిడిపి అధినేత చంద్రబాబు మరో అడుగు మందుకేసి అమిత్ షా అర్హతనే ప్రశ్నించడంతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అసలు ఊరుకునేదే లేదని ఏకంగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీంతో ఇక ఈ రెండు పార్టీల మధ్య ఇన్నాళ్లు మాటలకే పరిమితమైన మాటల యుద్దం...ఒకరిపై మరొకరి పైచేయి కోసం చర్యల రూపం తీసుకనే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఎపి భవిష్యత్ రాజకీయ చిత్రంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆందోళన చెందాల్సిన అంశమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications