'అమృత్ భారత్'పై ఇండియన్ రైల్వే అదిరిపోయే న్యూస్
భారతీయ రైల్వే కొత్తగా ప్రవేశపెడుతున్న 'అమృత్ భారత్' ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లలో ద్వితీయ శ్రేణి, స్లీపర్ తరగతుల్లో టికెట్ ఛార్జీలు ఇతర మెయిల్/ ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17% ఎక్కువగా ఉండనున్నాయి. 50 కిలోమీటర్ల లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా ఉంటుంది. రిజర్వేషన్ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు, దేశంలోని అన్ని జోనల్ కార్యాలయాలకు సమాచారమిచ్చింది.
సెకండ్ క్లాస్, స్లీపర్ లో ఏయే దూరానికి ఎంతెంత ఛార్జీలు వసూలు చేసేదీ తెలిపే పట్టికను కూడా యాడ్ చేసింది. ప్రభుత్వం తిరిగి చెల్లించని (రీయంబర్స్ చేయని) రాయితీ/ ఉచిత టికెట్లను ఈ రైల్లో అనుమతించడంలేదు. రైల్వే సిబ్బందికి ఇచ్చే పాసులు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (పీటీవో)ల విషయంలో నిబంధనలు.. మెయిల్/ ఎక్స్‌ప్రెస్‌లతో సమానంగా ఉంటాయి.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల టికెట్ల సొమ్మును ప్రభుత్వం పూర్తిగా తిరిగి చెల్లిస్తుండటంతో వారి పాసులు/ కూపన్లు 'అమృత్ భారత్'లో చెల్లుతాయి. అయోధ్య నుంచి తొలిరైలు బయలుదేరనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 30న జెండాఊపి ప్రారంభించనున్నారు. తొలిరైలులో సెకెండ్ క్లాస్, స్లీపర్ ఉంటాయి.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేస్తోంది. వాటిల్లో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ తోపాటు అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. వందే భారత్ లో ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అమృత్ భారత్ రైళ్లల్లో ఛార్జీల భారం లేకుండా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications