పళ్ళెం, గరిటెతో చంద్రబాబుకు వినపడేలా వైఎస్ షర్మిల మోత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ హామీలిచ్చిన అన్ని పథకాలను అమలు చేయటం లేదని, చంద్రబాబుకి వినిపించేలా పళ్ళెం, గరిటెతో థాలి బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ పళ్ళెం, గరిటెతో మోగిస్తూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా చౌక్ వద్ద నేడు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబు సర్కార్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ?
సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా ? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మీది ముంచే ప్రభుత్వంగా భావిస్తుందని షర్మిల పేర్కొన్నారు. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే...ప్రజలు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారని, కూటమిప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

సూపర్ సిక్స్ అమలుపై మీ ప్లాన్స్ ఏమీ లేవు
సూపర్ సిక్స్ లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అన్నారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద మీ ప్లాన్స్ ఏమీ లేవన్నారు. ప్రభుత్వ పరంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవని షర్మిల విమర్శించారు. అన్నదాత సుఖీభవ ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
వరదల పరిహారం మీద కోత పెట్టిన ప్రభుత్వం ముంచే ప్రభుత్వమే
20 వేలు ఇస్తామని చెప్పిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పడిన వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే చంద్రబాబు కేవలం 2 లక్షల ఎకరాలకు పరిహారం అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పరిహారం మీద కోత పెట్టిన ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వం అనరా ? అంటూ ప్రశ్నించారు.
రాజధాని లేని రాష్ట్రమే కాదు...బడ్జెట్ లేని రాష్ట్రం కూడా
రాష్ట్రంలో రైతుల కష్టాలు కనిపించడం లేదా ? వరదలో సర్వం కోల్పోతే కేవలం 4 లక్షల మందికి పరిహారం ఇస్తారా ? అని ప్రశ్నించారు. మోదీకి రాష్ట్రం పై చిన్నచూపు ఉందని, రాష్ట్రం వరదలలో విలవిలలాడితే ఏం ఇచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ తో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాలన్నారు. మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు...బడ్జెట్ లేని రాష్ట్రం కూడా అని మండిపడ్డారు షర్మిల.
బాబు సర్కార్ కూడా విశ్వసనీయత కోల్పోతుంది
100 రోజుల్లో బడ్జెట్ పెట్టే ధైర్యం లేదన్నారు. కనీసం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ధైర్యం కూడా చేయడం లేదని, ఇస్తామన్న హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. గతంలో జగన్ సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు బాబు సర్కార్ కూడా విశ్వసనీయత కోల్పోతుంది అన్నారు.












Click it and Unblock the Notifications